ఎల్లో మీడియాను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా అవమానిస్తున్నారు. తన కోసం జర్నలిజం నైతిక విలువలకు పాతరేసి, దిగంబరంగా నిలిచి వైఎస్ జగన్‌పై కట్టు కథలు అల్లుతూ జనంలో విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తున్న ఎల్లో మీడియాను కాదని చంద్రబాబు మరో డిజిటల్ పత్రికను తీసుకురావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ ఎల్లో మీడియా రాతలు, చేతలపై నమ్మకం లేకపోవడమే అనే చర్చకు తెరలేచింది.
చైతన్యరథం పేరుతో టీడీపీ ఈ-పేపర్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రోజుకు 30 లక్షల మందికి ఈ పేపర్‌ను సోషల్ మీడియాలో పంపడమే లక్ష్యమన్నారు. ఎన్టీఆర్ చైతన్య రథాన్ని అధిరోహించి 9 నెలల కాలంలోనే 202 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడానికే టీడీపీ డిజిటల్ పత్రికను ఉపయోగిస్తారని బాబు అన్నారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, అదే సమాచారాన్ని ప్రజలకు చేరవేసి వారిలో చైతన్యం తేవడం ఈ పత్రిక ఉద్దేశమన్నారు. స్వతంత్రంగా వ్యవహరించే మీడియాపై వేటు వేయడం దుర్మార్గమని చంద్రబాబు జోక్ వేయడం కొసమెరుపు.
ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టడానికే టీడీపీ డిజిటల్ పత్రికను తీసుకొస్తున్నట్టు చంద్రబాబు అంటున్నారని, మరి ఇంత కాలం తాము చేస్తున్నదేంటని ఎల్లో మీడియా ప్రతినిధులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్‌ను చంద్రబాబు కేవలం రాజకీయ ప్రత్యర్థిగా చూస్తే…తాము మాత్రం శత్రువుగా భావించి అనేక కనికట్టు వార్తలను వండివార్చుతున్నందుకు ఇదా బహుమతి అని ఎల్లో మీడియా ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత కాలం తాము చేసిన, చేస్తున్న శ్రమంతా టీడీపీ డిజిటల్ పత్రికలో పోసిన పన్నీరైందని అంటున్నారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌పై గత రెండు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న తమను కాదని టీడీపీకి డిజిటల్ పత్రిక ఏం అవసరం వచ్చిందనే ప్రశ్నలు ఎల్లో మీడియా నుంచి ఉత్పన్నమవుతున్నాయి.
తమ కంటే టీడీపీ డిజిటల్ పత్రిక దిగంబరంగా నిలిచి వార్తలు రాసి, జనాన్ని చైతన్యపరచగలదా? అని వారు నిలదీస్తుండడం గమనార్హం. భార్య ఉండగా మరో పెళ్లి చేసుకున్నట్టుగా… టీడీపీ డిజిటల్ పత్రిక ప్రారంభించడాన్ని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.