తనను ముఖ్యమంత్రి పదవికి దూరం చేశాడని మెగాస్టార్ చిరంజీవిని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుర్తు చేస్తూ…మరోసారి ఆయన్ని దెప్పి పొడిచారు. మరి ముఖ్యమంత్రి పీఠంపై కూచోబెట్టిన మెగాస్టార్ తమ్ముడు పవన్‌కల్యాణ్‌ను చంద్రబాబు ఎందుకు గుర్తు తెచ్చుకోవడం లేదు? చిరంజీవి చేటేనా… పవన్ మేలు గుర్తు రాలేదేం?… ఇప్పుడీ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీడీపీ డిజిటల్ పత్రిక ప్రారంభం సందర్భంగా చంద్రబాబునాయుడు పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2009లో చిరంజీవి పార్టీ పెట్టకుండా ఉంటే తానే అధికారంలోకి వచ్చేవాడినని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదొక చారిత్రక సందర్భమన్నారు. అప్పుడు, ఇప్పుడు చిరంజీవి తనకు శ్రేయోభిలాషేనని బాబు తెలిపారు. సినిమా టికెట్ల వివాదంలో తమను లాగడం కరెక్ట్ కాదన్నారు. సినిమా వాళ్లు టీడీపీని సమర్థిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తనకు వ్యతిరేకంగా, అందులోనూ తాను అధికారంలో వుండగానే సినిమాలు తీశారని చంద్రబాబు గుర్తు చేయడం గమనార్హం.
2009లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం వల్లే టీడీపీ ఓడిపోయిందనే బాధను చంద్రబాబు మరోసారి వ్యక్తపరచడంపై జనసేన ఆగ్రహంగా ఉంది. 2014లో తమ నాయకుడైన జనసేనాని పవన్‌కల్యాణ్ మద్దతు ఇవ్వడం వల్లే చంద్రబాబుకు అధికారం దక్కిందనేది వాస్తవం కాదా? అని ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చేసిన మేలును మరిచిపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు.
2014లో బీజేపీ-టీడీపీ కూటమికి జనసేన మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కేవలం 2 శాతం లోపు ఓట్ల తేడాతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారాన్ని పోగొట్టుకున్నారు. అవినీతిపరుడైన జగన్‌కు అధికారం దక్కకూడదనే ఉద్దేశంతోనే తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలకానని పలు సందర్భాల్లో పవన్‌కల్యాణ్ ప్రకటించడం అందరికీ తెలిసిందే. కానీ ఈ విషయాన్ని చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తావించరు.
ఎంతసేపూ తాను అధికారానికి దూరం కావడాన్ని మాత్రమే ఆయన గుర్తు చేస్తూ…పరోక్షంగా చిరంజీవి దెప్పి పొడుస్తారు. బాబు మాటల వెనుక మర్మాన్ని పవన్‌కల్యాణ్ ఎప్పుడు గ్రహిస్తారో మరి!