పొత్తులు, ఎత్తులు లేకపోతే చిత్తుగా ఓడిన చరిత్ర

తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భవించింది. ఎన్.టి.ఆర్ ప్రాభవానికి నాదెండ్ల భాస్కరరావు సౌజన్యం కొంత తోడై తొలి అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా జనాల్లోకి చొచ్చుకుపోయింది.  Advertisement కొత్తొక వింత లాగ అప్పటి ప్రజలు ఎన్.టి.ఆర్ ఆత్మగౌరవ…

తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భవించింది. ఎన్.టి.ఆర్ ప్రాభవానికి నాదెండ్ల భాస్కరరావు సౌజన్యం కొంత తోడై తొలి అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా జనాల్లోకి చొచ్చుకుపోయింది. 

కొత్తొక వింత లాగ అప్పటి ప్రజలు ఎన్.టి.ఆర్ ఆత్మగౌరవ నినాదానికి బాగా కనెక్ట్ అయ్యారు. 

పైగా తమిళ రాజకీయాల్లోలాగ అప్పటికింకా తెలుగు సినిమా రంగం తెలుగు రాజకీయాలతో పెనవేసుకోలేదు. 

నటుడిగా ఎన్.టి.ఆర్ పై ఉన్న అభిమానం, నాటకీయమైన ఆయన ప్రసంగాలు జనాన్ని ఉర్రూతలూగించి తెలుగు రాజకీయ చిత్రపటంపై ఏదో కొత్త అధ్యాయం లిఖింపబడుతోందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. అలా కలగడానికి అప్పటి ఈనాడు పాత్ర చాలా పెద్దది. ఫలితంగా ఘనమైన మెజారిటీతో 1983లో ఏ పొత్తూ అవసరం లేకుండా నెగ్గింది తెదేపా. 

ఇప్పుడు ఎన్.టి.ఆర్ ఘన చరిత్రని చాటుకుంటారు కానీ అప్పట్లో విపరీతమైన విమర్శలుండేవి ఆయన పాలన మీద, తీరు మీద. ఆ విమర్శల్ని ఆయనపై సినిమాలుగా కూడా తీసారు.  

ఈ మధ్యన రాం గోపాల్ వర్మ చంద్రబాబుకి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్.టీ.ఆర్, కమ్మరాజ్యంలో కడప రెడ్లు లాంటి సినిమాలు తీసినట్టు అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ, ప్రభాకర రెడ్డి కూడా ఎన్.టి.ఆర్ మీద తీసారు.  

గండిపేట రహస్యం, కలియుగ విశ్వామిత్ర, సాహసమే నా ఊపిరి, మండలాధీశుడు ఇలా ఎన్నో సినిమాలు ఎన్.టి.ఆర్ ని ఒక తెలివితక్కువ పిచ్చిమారాజుగా, కుట్రదారుడిగా చూపించాయి.  

సినిమాల వల్ల కావొచ్చు, పాలన నచ్చక కావొచ్చు ప్రజల్లో వ్యతిరేకత కూడగట్టుకున్న మాట వాస్తవం. అప్పుడే ఎన్.టి.ఆర్ కి అర్థమయింది. పొత్తు లేనిదే గెలవడం కష్టమని. అందుకే ఆ రోజుల్లో సంజయ్ విచార్ మంచ్ తో ఎన్.టి.ఆర్.అవగాహన పెట్టుకున్నారు. ఆ అవగాహన సాయంతోనే మరోసారి గెలవగలిగారు. 

ఆ కాలంలోనే కమ్మ కులస్థుల ప్రభ వెలిగింది. ఎక్కడెక్కడి కమ్మవారో పార్టీలో చేరారు. తెదేపా వచ్చే వరకు అసెంబ్లీలో అన్ని కులాల వారికీ ప్రాతినిధ్యం ఉండేది. కానీ క్రమంగా కమ్మవారి ప్రాబల్యం పెరిగింది. “తనవాడు” అనుకున్నవాడికి ఎన్.టి.ఆర్ ఎప్పుడూ పెద్ద స్థానమే కల్పించారు. కానీ ఎన్నికల్లో గెలవడానికి మాత్రం తన పార్టీ ప్రతినిధులొక్కరివల్లే పనయ్యేది కాదు. పొత్తుల ఎత్తులు తప్పేవి కావు. 

1996నాటి వెన్నుపొటు పర్వం తెలిసిందే. నిజనికి చంద్రబాబొక్కడే వెన్నుపోటు పొడిచాడంటారు కానీ, ఎన్.టి.ఆర్ అభయంతో నాయకులైన వాళ్లెందరో వైస్రాయ్ కుట్రలో భాగమై వెన్నుపోటు పొడిస్తే తప్ప పని జరగలేదు. ముఖ్యమంత్రైన తొలినాళ్లల్లో నాదెండ్ల భాస్కర రావు విఫలయత్నం చేసినా, తర్వాత చంద్రబాబు నాయకత్వంలో యావన్మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వెన్నుపోటు పొడిచి పార్టీని నందమూరి నుంచి నారా చేతుల్లోకి మారేట్టు చేసారు. 

పార్టీ లాక్కోవడానికి చంద్రబాబుకి పనికొచ్చిన ఐకమత్యం, స్వామిభక్తి సార్వత్రిక ఎన్నికల్లో గెలవడానికి మాత్రం సరిపోలేదు. మళ్లీ మామగారి పొత్తుల ఫార్ములానే అవలంబించాల్సొచ్చింది జామాతకి. 

చంద్రబాబు తొలి ఎన్నికలు చూసింది 1999లో. అప్పుడు భాజపాతో పొత్తు పెట్టుకున్నారు. కార్గిల్ యుద్ధానికి మూడు నెలల అనంతరం వచ్చిన ఎన్నికల్లో దేశప్రజలంతా భాజపాకి ఘనమైన విజయాన్ని అందించారు. ఆ వేవ్ లో ఇక్కడ చంద్రబాబు కూడా ఏరు దాటేసారు. 

అప్పటి ఆ.ప్రలో 293 అసెంబ్లీ స్థానాలకి గాను 269 లో తెదేపా పోటీ చేసి 180 గెలుచుకుంటే, 24లో పోటీ చేసిన భాజపా 12 స్థానాల్లో గెలిచింది. మునుపటి ఎన్నికలతో పోలిస్తే తెదేపా 36 సీట్లు కోల్పోతే, భాజపా 9 అదనంగా గెలిచింది. 

తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికలు. అప్పుడు మొత్తం స్థానాలు 294 కి గాను తెదాపా 267లో పోటీ చేసి భాజపాని 27 లో చేయించింది. తాను మునగడమే కాకుండా భాజపాని కూడా ముంచేసింది. ఆ పొత్తు దెబ్బకి భాజపా మునుపటి కంటే 10 సీట్లు కోల్పోయి కేవలం 2 తో సరిపెట్టుకోవల్సి వచ్చింది. ఇక 267 స్థానాల్లో తెదేపా గెలిచింది కేవలం 47. దానికి కారణం అప్పటి వైఎస్సార్ హవా. ఏ పొత్తూ లేకుండా కాంగ్రెస్ నుంచి సింగిల్ హ్యాండెడ్ గా పాదయాత్ర చేసి ప్రజల మనసు గెలుచుకుని నేరుగా సీయం కుర్చీ ఎక్కాడాయన. 

ఇక 2009 ఎన్నికలు. మళ్లీ వైయస్సార్ పొత్తురహిత పోటీ చేసి సీయమ్మయ్యారు. తెదేపా మహాకూటమితో పొత్తు పెట్టుకుని తాను మునిగి కూటమిలోని పార్టీలనీ ముంచింది. 

2014 సంగతి తెలిసిందే. బీజేపీతో మాత్రమే కాకుండా జనసేనతో కూడా పొత్తు పెట్టుకుంది తెదేపా. మోదీ హవాలో గాలివాటానికి ఎగిరి చంద్రబాబు సీయం కుర్చీలో పడ్డారు. 

2019లో బీజేపీని వెన్నుపోటు పొడిచి జన్మవైరి కాంగ్రెసుతో జట్టుకట్టి ఘోరపరాజయం పాలయ్యింది తెదేపా. అంతేకాకుండా కాంగ్రెస్ అనేది ఆ.ప్ర మ్యాపులో లేకుండా పోయింది.

దీనినిబట్టి అర్థమయ్యేదేంటి? 

తెదేపా పొత్తులేనిదే ఎన్నికల్లో పోటీ చేయదు. గెలిస్తే తెదేపాకి లాభం తప్ప పొత్తు పెట్టుకున్న వారికి కాదు. ఓడితే నిండా మునిగేది మాత్రం పొత్తు పెట్టుకున్నవాళ్లే. 

ఇలాంటి చరిత్ర కళ్లముందు పెట్టుకుని చంద్రబాబు నాయుడు తమ పొత్తులకు, ఫలితాలకు సంబంధం లేదని చెబుతున్నారు.

గతంలో టిడిపి పొత్తులతో ఉన్నప్పుడు ఓటమి చెందిందని, పొత్తులు లేనప్పుడు గెలిచిన సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారని ప్రచారం జరుగుతోంది.

కుప్పంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు అలా అన్నారని తెదేపా సానుభూతి పత్రికలో కథనం వచ్చింది. 

తాము ఒంటరిగా గెలిచిన ఎన్నికలు కూడా ఉన్నాయని వైసిపి నేతలు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారట.

జరిగినది కాకుండా తాను ఊహించుకునేదే చరిత్ర, తాను కలగనేదే సత్యం అని బలంగా నమ్మే మానసిక స్థితిని ఏమంటారో మానసిక వైద్యనిపుణులే చెప్పాలి.

శ్రీనివాసమూర్తి