ఉత్తరప్రదేశ్‌లో తన మాయలేవీ పని చేయవనే నిర్ణయానికి వచ్చి ఎన్నికల బరి నుంచి బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యయంత్రి మాయావతి తప్పుకున్నారా? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో మాయవతి ప్రభ…గత కాలపు చరిత్ర అని ఆ రాష్ట్ర రాజకీయాలు చెప్పకనే చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా దళిత వర్గాల్లో మాయావతికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉన్నాయి.
అంతెందుకు 2019 ఎన్నికల సందర్భంగా బీఎస్పీతో జనసేనాని పవన్‌కల్యాణ్ పొత్తు కుదుర్చుకున్న సంగతిని మరిచిపోలేం. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఆమె ప్రచారం కూడా నిర్వహించారు. దళితుల్లో మంచి పట్టున్న వైసీపీ ఓట్లను చీల్చేందుకే పవన్‌కల్యాణ్ వ్యూహాత్మకంగా మాయావతితో పొత్తు కుదుర్చుకున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి మాయావతి తప్పుకోవడం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమ నాయకురాలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీఎస్పీ ఎంపీ సతీష్‌చంద్ర మిశ్రా ప్రకటించారు. ఫిబ్రవరి 10న మొదటి విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 7వ తేదీతో ఆ రాష్ట్రంలో ఎన్నికలు ముగుస్తాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి పోటీ చేయకపోయినా…తమ పార్టీ అధికారంలోకి వస్తుందని సతీష్‌చంద్ర మిశ్రా చెప్పడం గమనార్హం. సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ అధికారంలోకి రావడం లేదని ఆయన అన్నారు. గతంలో సమాజ్‌వాదీ, బీఎస్పీ పొత్తు కుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేసినా బీజేపీ విజయానికి అడ్డుకట్ట వేయలేకపోయాయి. అలాంటిది ఇప్పుడు ఎవరికి వారుగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
మరోసారి బీజేపీనే అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. తనపై కేసుల నేపథ్యంలో మాయావతి ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి లబ్ధి చేకూర్చుతోందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలేంటో మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడించాల్సిందే.