ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం శ్రీ సింహాచలం వరాహ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయానికి కూడా కరోనా ఆంక్షలు వచ్చేశాయి. కరోనా నానాటికీ తీవ్రమవుతున్న నేపధ్యంలో అప్పన్న అంతరాలయంలో దర్శనాలను రద్దు చేస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
మామూలుగా అయితే 300 రూపాయల టికెట్ మీద అంతరాలయంలోకి భక్తులను అనుమతిస్తారు. అలా స్వామికి దగ్గరగా చూసే భాగ్యగ్యం అందరికీ కలుగుతుంది. అయితే ఇపుడు కరోనా కేసులు విశాఖలో దారుణంగా పెరిగిపోతున్నాయి. అదే విధంగా ఒడిషా, చతీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అప్పన్నను దర్శించుకునేందుకు వస్తారు.
దాంతో రద్దీని నివారించడానికి ఈ చర్యలు తీసుకున్నారు. అదే విధంగా అంతరాలయంలోకి ప్రవేశం లేకుండా బయట నుంచే స్వామి వారిని దర్శించుకుని వెళ్ళిపోయేలా చూస్తున్నారు. ఇక ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేళ కూడా కరోనా ఆంక్షలకు కట్టుబడి అంతా ఉండాలని సూచిస్తున్నారు.
మొత్తానికి చూసుకుంటే అప్పన్న భక్తులకు స్వామికీ మధ్యన కరోనా మహమ్మారి దూరం పెంచిందని, అడ్డు తెర వేసిందని ఆస్తిక జనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి కరోనా తగ్గాకనే స్వామిని దగ్గరుండి చూసేది అనుకుంటూ అంతా నిట్టూరుస్తున్నారు.