ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భలే సరదా మనిషి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అనుకూలమనే ముద్ర నుంచి బయట పడేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నట్టు కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటనను సాకుగా తీసుకుని జగన్ ప్రభుత్వంపై ఆయన కాలు దువ్వడం నవ్వు తెప్పిస్తోంది.
ఇవాళ ఆయన విజయవాడలో తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. ఆత్మకూరు ఘటనలో ముద్దాయి జగన్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ఆత్మకూరులో బీజేపీ నాయకులతో పాటు పోలీసులపై కూడా దాడి జరిగిందన్నారు. బీజేపీ నాయకుడు శ్రీకాంత్‌రెడ్డిని చంపేస్తామని బెదిరించిన ఆడియో తమ దగ్గర ఉందన్నారు.
హత్యా బెదిరింపులు అందుకున్న శ్రీకాంత్‌రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారా? అని ఆయన నిలదీశారు. అరాచక పాలన చేసేందుకేనా వైసీపీకి అధికారం ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. శ్రీకాంత్‌రెడ్డితో పాటు బీజేపీ నాయకులపై కేసులు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపుతున్నారని, ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోకపోతే తాడోపేడో తేల్చుకుంటామని సోము వీర్రాజు హెచ్చరించడం గమనార్హం.
సోము వీర్రాజు హెచ్చరికలపై నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. తమతో మిత్రపక్షంగా ఉంటూ టీడీపీతో కలిసి రాజకీయాలు చేయాలనే ప్లాన్ చేస్తున్న జనసేనతో తాడోపేడో తేల్చుకుంటే మంచిదని నెటిజన్లు హితవు చెబుతున్నారు. ఒకవైపు జనసేనాని తమతో ఉండడని తెలిసి కూడా బీజేపీ, సోము వీర్రాజు ఎందుకని ఆత్మవంచన చేసుకుంటున్నారో ఆలోచించాలని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వంపై కాకుండా, తమ పార్టీలోని కోవర్టులు, మిత్రపక్ష పార్టీ వెన్నపోటుపై తాడోపేడో తేల్చుకుంటే బీజేపీకి భవిష్యత్ ఉంటుందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.