సినిమాల వరకే మనోభావాలు

చదవేస్తే వున్నమతి పోయిందని వెనకటికి సామెత. రాను రాను కొన్ని వ్యవహారాలు అలా తయారవుతున్నాయి. ముఖ్యంగా సినిమా టైటిల్స్ మీద అభ్యంతరాలు చిత్రంగా వుంటున్నాయి. కొన్ని లాజికల్ అనిపిస్తుంటే, కొన్ని ఏదో ఒకటి చేయాలి…

చదవేస్తే వున్నమతి పోయిందని వెనకటికి సామెత. రాను రాను కొన్ని వ్యవహారాలు అలా తయారవుతున్నాయి. ముఖ్యంగా సినిమా టైటిల్స్ మీద అభ్యంతరాలు చిత్రంగా వుంటున్నాయి. కొన్ని లాజికల్ అనిపిస్తుంటే, కొన్ని ఏదో ఒకటి చేయాలి కదా? అని చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఆ మధ్య వాల్మీకి అనే టైటిల్ మీద గొడవ జరిగింది. సరే, వాల్మీకి అనే మహానుభావుడి పేరును రౌడీయిజం లుక్ వున్న హీరో పాత్రకు పెట్టారని అభ్యంతరం చెప్పారని సరిపెట్టుకోవచ్చు.

ఇప్పుడు భీష్మ టైటిల్ మీద కూడా అదే సమస్య. ఆజన్మబ్రహ్మచారి, మహానుభావుడు అయిన భీష్ముడి పేరును ఓ లవర్ బాయ్ క్యారెక్టర్ కు పెట్టారన్నది అభ్యంతరం. చిత్రంగా వుంది. లావుగా బలంగా వున్నవాడిని భీముడు అని, ఎత్తులు జిత్తులు వేసేవాడిని శకుని అని, పెళ్లి చేసుకోకుండా వుండిపోయిన వాడిని భీష్ముడు అని అనడం కామన్. ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య అంటే కృష్ణుడి పరువు తీసేసినట్లా? 

మన దగ్గర చలామణీలో వున్న పేర్లు అన్నీ ఏదో ఒక పురాణంలో వున్నవే. అరుంధతి మహాపతివ్రత. ఆమె పేరుతో సినిమా తీయకూడదు అంటే అరుంధతి సినిమా వచ్చి వుండేది కాదు. మరో పేరు వుండేది. రాము అనే పేరుతో, కృష్ణ పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి. 

అసలు ఈ లెక్కన పురాణ పాత్రల పేర్లు ఎవ్వరూ పెట్టుకోరాదు. భీష్మ, లేదా రాముడు అనే పేరు పెట్టుకున్నవాడు ఏవో చెత్త పనులు చేసినా, మనకు బాధ అనిపిస్తుంది కదా? అలాగే ఏ చికెన్ సెంటర్ లో శ్రీరామ చికెన్ సెంటర్ అని పేరు పెడితే బాధ అనిపిస్తుంది కదా? భవిష్యత్ లో నాగార్జున స్టూడియో అనేది వచ్చింది అనుకుందాం? హాత్తెరి..పవిత్రమైన నాగార్జునుడి పేరు నిత్యం డ్యాన్స్ లు, జోకులు, ఫైట్లు జరిగే స్టూడియోకి పెడతారా? అన్న గోల మొదలవుతుందేమో? అలాగే లాడ్జిలకు రామా లాడ్జి, కృష్ణ లాడ్జి లాంటి పేర్లు పెట్టొచ్చా. అక్కడ  రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి పేర్లు పెడతారా? అని నీలదీయవచ్చా?

కేవలం సినిమాల దగ్గరకు వచ్చేసరికే మనో భావాలు దెబ్బతింటున్నాయా? అక్కడ ఏం మతలబు వుంది అన్నది అర్థం కావడం లేదు. ఇలాంటి సమస్యలు వచ్చినపుడు వీలయినంత వరకు సర్దుకు పోవడానికే నిర్మాతలు చూస్తున్నారు తప్ప, లోపాయికారీగా ఏం జరిగిందో? ఏం జరుగుతోందో? బయటకు చెప్పడం లేదు. ఆ భీష్ముడికి ఈ భీష్ముడికి ఏ సంబంధం లేదు. ఇదేదో సరదా కథ తీసుకుని ఆ పేరు పెట్టుకున్నారు. అంత మాత్రం చేత భీష్ముడి పట్ల అపచారం జరిగిపోలేదు. 

ఆ మాటకు వస్తే ఆయన భీష్మాచార్యుడు. భారతంలో ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మాదిరిగానే కురుపాండవులను తీర్చిదిద్దిన ఆచార్యడు. కేవలం తండ్రికి మరో పెళ్లి విషయంలో తన పెళ్లి అడ్డం వచ్చిందని, ఆజన్మ బ్రహ్మచర్యం స్వీకరించాడు. ఇచ్ఛామరణ వరం పొందాడు.

అలాంటి కథను వక్రీకరిస్తే తప్పు, అలాంటి వక్రీకరణ చేసిన కథకు అదే టైటిల్ పెడితే తప్పు. అంతే కానీ, ఓ లవర్ బాయ్ కు భీష్మ అనే పేరు పెడితే తప్పు అంటే? ఓ మనిషికి, ఓ బ్రాండ్ కు, ఓ సంస్థకు పేరు పెట్టుకునే హక్కులు వున్నట్లే సినిమాలకు వీలయినంత జాగ్రత్తగా పేర్లు పెట్టుకునే హక్కు లేకుండా అయిపోయిందా? ఏమో?

త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చాలా పెద్దది