నేరాలూ ఘోరాలపై తమ్ముళ్ళే చెప్పాలిగా !

తెలుగుదేశం పార్టీ పెట్టింది సినీ నటుడు ఎన్టీ రామారావు. ఆయన పోకడలన్నీ సినిమాటిక్ గా ఉండేవని అప్పట్లో  విమర్శలు వచ్చేవి. ఇక ఆయన నుంచి అధికారం గుంజుకున్న అల్లుడు చంద్రబాబు జమానాలో పార్టీకి  మీడియా…

తెలుగుదేశం పార్టీ పెట్టింది సినీ నటుడు ఎన్టీ రామారావు. ఆయన పోకడలన్నీ సినిమాటిక్ గా ఉండేవని అప్పట్లో  విమర్శలు వచ్చేవి. ఇక ఆయన నుంచి అధికారం గుంజుకున్న అల్లుడు చంద్రబాబు జమానాలో పార్టీకి  మీడియా ఫోకస్ బాగా ఎక్కువైంది. అప్పట్లో బాబుని మీడియా బేబీ అని మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు కూడా కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఇక తనకు సొంతంగా పత్రికలు, మీడియా చానళ్ళూ లేవని బాబు పదే పదే చెప్పుకుంటారు కానీ ఆయన్ని ఆకాశానికెత్తేసే ఎల్లో గ్యాంగ్ పక్కనే ఉండగా ఇక వేరేగా మీడియా హౌస్ అవసరం ఏముందీ బాబూ అంటారు వైసీపీ నేతలు.

ఇక అదే పార్టీలో ఉన్న తమ్ముళ్ళకు సినిమా వాసనలతో పాటు, మీడియా మేనేజ్మెంట్ కళలూ బాగానే అబ్బుతాయన్నది కూడా ఓ సెటైర్. సరే ఇపుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్ముడు, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ మీడియాకు ఆత్మబంధువు అవతారాన్ని ఒక్కసారిగా ఎత్తేశారు.

ఆయన మీడియా రేటింగుల మీద కూడా మంచి సలహాలు ఇస్తున్నారు. వైసీపీ నేతలంతా క్రిమినల్ చరిత్ర కలిగిన వారట. అందువల్ల వారి జీవిత చరిత్రలను నేరాలూ ఘోరాలు పేరిట ఎపిసోడ్లుగా వేస్తే చానళ్ళ రేటింగ్ దారుణంగా పెరుగుతుందని అద్భుతమైన సలహా ఒకటి ఇచ్చేశారు.

దానికంటే  ముందు ఐటీ దాడుల గురించి, టీడీపీ పెద్దల అవినీతి భాగోతాల గురించి పుంఖానుపుంఖాలుగా ఎపిసోడ్లు వండి వారిస్తే  ఇంకా  ఎక్కువ రేటింగ్ వస్తుందని వైసీపీ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఓ సాధారణ అధికారి  వేల కోట్లు ఎలా కూడబెట్టగలుగుతారో జనం వాటిని చూసి తెలుసుకుంటారని కౌంటర్లు వేస్తున్నారు.

అవును మరి ఒక పక్కే ఎంతసేపూ చూపిస్తే మజా ఏముంటుంది. ఎల్లో మీడియా కూడా పసుపు తమ్ముళ్ళ భాగోతాలను కూడా చాటింపు వేస్తే ఇప్పటికే పడిపోయిన రేటింగులు పెంచుకోవచ్చునన్ని వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి. మొత్తానికి కూన తమ్ముడు మీడియా రేటింగులు పెరగాలంటే  రాజకీయ నేతలు నేరాలూ, ఘోరాలు చేయాలని తేల్చేసినట్లుగా ఉందంటున్నారు.

ఏ జోనర్ చేసినా ఫ్లాపులు పలకరించాయి