గత వారం రోజులుగా టాలీవుడ్ లో గట్టిగా వినిపించిన వార్త ఏమిటంటే..సెప్టెంబర్ 4న టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్ ను కలవడానికి వెళ్తున్నారు అన్నది. అది వట్టి గ్యాసిప్ మాత్రమే అని ఇప్పుడు తెలుస్తోంది.
ఎందుకంటే ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి అప్ డేట్ లేదు. అందువల్ల నాలుగున అయితే మీట్ లేనట్లే. మరి ఇంకెప్పుడు వుంటుందన్నది తెలియదు. టాలీవుడ్ వర్గాలు అయితే ఇప్పట్లో ఆంధ్ర సీఎం తో సమావేశం వుండే అవకాశాలు లేవు అంటున్నాయి.
జగన్ విపరీతమైన పనుల వత్తిడిలో వున్నారని, అందువల్ల ఇప్పట్లో టాలీవుడ్ పెద్దలకు అపాయింట్ మెంట్ ఇవ్వడం అన్నది సాధ్యం కాకపోవచ్చు అని వినిపిస్తోంది. అదీ కాక, సినిమా టికెట్ ల విషయంలో సీఎం జగన్ ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసి, ఆ ప్రపోజల్ ను టాలీవుడ్ పెద్దల ముందు వుంచాలని అనుకుంటున్నట్లు బోగట్టా.
అలాంటి ప్రపోజల్ తయారు కాకుండా టాలీవుడ్ పెద్దలను పిలవడం వృధా. ఇదిలా వుంటే టాలీవుడ్ గ్రూప్ లో వెళ్లాల్సిన నాగార్జున కూడా బిజీ అయిపోతున్నారు. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లబోతున్నారని తెలుస్తోంది. అలాగే ప్రతి వీకెండ్ ల్లో బిగ్ బాస్ పనులు పెట్టుకుంటున్నారు.
మొత్తం మీద చూస్తుంటే ఇప్పట్లో ఆంధ్రలో టికెట్ రేట్లు సవరణ వుంటుందని ఆశించడానికి లేదేమో?