మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి సీనియర్ నటుడు నరేష్ పెట్టబోయే నైట్ పార్టీపై, అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ స్పందించారు. అసోసియేషన్ కు సంబంధించి ఎన్నో అంశాల్లో నరేష్ తో విబేధించిన ప్రకాష్ రాజ్, నైట్ పార్టీపై మాత్రం నరేష్ కు మద్దతు పలికారు. అందులో తప్పులేదన్నారు. అదో రకం ప్రచారం అని కూడా ముక్తాయించారు.
“నైట్ పార్టీలు చేసుకుంటున్నారట. చేసుకోండి తప్పేముంది. ప్రతి ఒక్కరు వాళ్ల మెంబర్స్ ను కలవాలి. పగలంతా షూట్ ఉంటుంది కాబట్టి రాత్రిళ్లు కలుస్తున్నారేమో. వాళ్ల కలలు చెప్పుకుంటారేమో. వాళ్ల ప్రైవేట్ విషయాలపై నేను మాట్లాడను. అలాంటి పార్టీల్ని తప్పుపట్టకూడదు. అందరూ కళాకారులే. సాయంత్రం వేళల్లో కలుసుకుంటారు.”
ఈరోజు తన ప్యానెల్ కు సంబంధించి ఈసీ మెంబర్స్ ను ప్రకటించిన ప్రకాష్ రాజ్.. ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మంచు విష్ణు ఇచ్చిన ''మా భవనం'' హామీపై స్పందించారు. నిజంగా భవనం కావాలని మెంబర్స్ అంతా భావిస్తే, విష్ణునే గెలిపిస్తారని అన్నారు. అసొసియేషన్ కోసం సొంతంగా బిల్డింగ్ కట్టేంత ఆర్థిక స్తోమత తనకు లేదన్న ప్రకాష్ రాజ్.. నరేష్ నైట్ పార్టీ పెడుతోంది విష్ణు కోసమే కదా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేదు.
“ఓ 30 మంది కలిసి పార్టీ చేసి మాట్లాడుకుంటారు. మరో 10 మందికి చెబుతారు. క్యాంపెయిన్ అలానే జరుగుతుంది కదా, తప్పేముంది అందులో. ఎన్నికల ప్రచారంలా ఇంటింటికి వెళ్లలేరు కదా. బాగా పరిచయస్తులందర్నీ పార్టీకి పిలుస్తారు. కలిసి భోజనం చేస్తారు, మందు కొడతారు. ఇట్స్ ఓకే. తప్పులేదు అందులో.”
నరేష్ పెట్టబోయే వీకెండ్ పార్టీపై ఇలా స్పందనను తెలియజేసిన ప్రకాష్ రాజ్.. తన హామీల్ని మాత్రం బయటపెట్టలేదు. అసొసియేషన్ కు కావాల్సింది బిల్డింగ్ మాత్రమే కాదన్న ప్రకాష్ రాజ్, నోటిఫికేషన్ వెలువడిన వెంటనే తమ హామీల్ని వెల్లడిస్తామన్నారు.