కార్నర్ అవుతున్న సురేష్ బాబు

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సురేష్ బాబు మీద థియేటర్ జనాలు, డిస్ట్రిబ్యూటర్లు మండిపడుతున్నారు. పైకి ఏమీ అనలేక వాళ్లలో వాళ్లే ఒకరి దగ్గర మరొకరు తమ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. దీనికి కారణం మరేం…

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సురేష్ బాబు మీద థియేటర్ జనాలు, డిస్ట్రిబ్యూటర్లు మండిపడుతున్నారు. పైకి ఏమీ అనలేక వాళ్లలో వాళ్లే ఒకరి దగ్గర మరొకరు తమ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. దీనికి కారణం మరేం లేదు. 

దృశ్యం 2, నారప్ప, విరాటపర్వం సినిమాలను ఓటిటిలకు విక్రయించడానికి సురేష్ బాబు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు బయటకు రావడమే. దృశ్యం 2 సినిమా నిర్మాతలు తాము మలయాళంలో నిర్మించిన మాతృకను ఓటిటికే ఇచ్చేసారు. 

సినిమా స్టార్ట్ చేసినపుడే పరిస్థితులు బాగాలేకుంటే ఓటిటికే అని డిసైడ్ అయి రంగంలోకి దిగారు. కానీ నారప్ప అలా కాదు. థియేటర్లలోకి వస్తుందని, పెద్ద సినిమా అవుతుందనీ అందరూ నమ్మకంతో వున్నారు. 

అలాగే విరాటపర్వం విడుదల డేట్ వేసి కూడా వాయిదా వేసారు. అది కూడా మంచి సినిమా అవుతుందనే అంచనాలు వున్నాయి. ఇలాంటి సినిమాలను ఓటిటి కి ఇవ్వడం, అది కూడా సురేష్ బాబు లాంటి ఎగ్జిబిటర్, కమ్ డిస్ట్రిబ్యూటర్ ఇవ్వడం ఏమిటి అన్నది సినిమా జనాల ఆవేదన,

థియేటర్లు నడిపే వ్యక్తే థియేటర్లను చంపేసేలా నిర్ణయం తీసుకోవడం ఏమిటి? అన్నది ఇండస్ట్రీ జనాల ఆవేదన. పోనీ చిన్న నిర్మాతలు ఎవరైనా అలాంటి పని చేసారు అంటే అర్థం చేసుకోవచ్చు అని, వేల కోట్ల సామ్రాజ్యం వున్న సురేష్ బాబు ఇలా చేయడం ఏమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

సురేష్ బాబు వ్యాపార భాగస్వామి ఆసియన్ సునీల్ 45 కోట్ల ఆఫర్ వచ్చినా తను నిర్మించిన లవ్ స్టోరీ ని థియేటర్ కే అని అలా వుంచేసారు.

నేరుగా సురేష్ బాబును నిలదీయకుండా సేవ్ థియేటర్స్ అనే కాంపెయిన్ కు తెరతీసారు. జూలై నెలాఖరుకు థియేటర్లు అన్నీపూర్తిగా తెరచుకుంటాయని, ఆంధ్రలో కూడా జూలై 10 తరువాత థియేటర్లకు అనుమతి వచ్చేస్తుందని, అంత వరకు నిర్మాతలు ఓపికతో వుండాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు.