మొన్నటికి మొన్న రామ్ చరణ్ జిమ్ లో గాయపడ్డాడు. దీంతో 3 వారాల పాటు ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ నిలిపివేశారు. ఇప్పుడీ సినిమాకు మరో షాక్ తగిలింది. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ఫారిన్ హీరోయిన్ డైసీ జోన్స్ ప్రకటించింది.
“దురదృష్టవశాత్తూ నా కుటుంబంలో తలెత్తిన కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ లో పాల్గొనలేకపోతున్నాను. సినిమా స్క్రిప్ట్ చాలా బాగుంది. నిజంగా ఇదొక గొప్పపాత్ర. రాబోయే రోజుల్లో నా పాత్ర ఎవరు పోషించినా ఆమెకు కూడా అపూర్వ స్వాగతం దక్కుతుంది. యూనిట్ కు ఆల్ ది బెస్ట్.”
ఆర్-ఆర్-ఆర్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇలా అఫీషియల్ గా ప్రకటించింది డైసీ జోన్స్. అయితే తప్పుకోవడానికి సరైన కారణాల్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. కేవలం కుటుంబ సమస్యలు అని మాత్రమే చెప్పుకొచ్చింది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు 10 రోజుల కిందటే యూనిట్ కు సమాచారం అందించింది జోన్స్. లెక్కప్రకారం ఆమె పూణె షెడ్యూల్ లో జాయిన్ అవ్వాలి. కానీ తన ప్రయాణానికి ఏర్పాట్లు చేయొద్దని, తను సినిమా చేయడం లేదని షెడ్యూల్ కు ముందే యూనిట్ కు చెప్పేసిందట జోన్స్. ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది.
కథ ప్రకారం, ఈ సినిమాకు విదేశీ నటి మాత్రమే అవసరం. జోన్స్ తప్పుకోవడంతో ఇప్పుడా పాత్ర కోసం మరోసారి వేట మొదలుపెట్టాలి. మన వద్ద అమీ జాక్సన్ లాంటి విదేశీనటులు ఉన్నప్పటికీ కొత్తమ్మాయి కోసం చూస్తోంది యూనిట్. ఎలాగూ నెక్ట్స్ షెడ్యూల్ కు మరో 3 వారాల టైమ్ ఉంది కాబట్టి, ఈ గ్యాప్ లో మరో విదేశీ భామను ఫిక్స్ చేస్తారేమో చూడాలి.