తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలి సినిమా దర్భార్ బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. తొలి రేజే నెగిటివ్ టాక్ ను పొందింది ఈ సినిమా. తమిళ రివ్యూయర్లు కూడా ఈ సినిమా పట్ల పెదవి విరిచారు. రజనీ స్టైల్ తప్ప మరేం లేదని తేల్చేశారు. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ సినిమాలన్నీ అలానే ఉంటున్న నేపథ్యంలో దర్భార్ పై నెగిటివ్ రివ్యూల ప్రభావం గట్టిగా పడింది. అయినా ఈ సినిమా మంచి వసూళ్లను అయితే సాధించింది. దాదాపు 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ ఈ సినిమాకు నష్టాలు మాత్రం భారీగా ఉన్నాయట!
రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ లో మెజారిటీ షేర్ రజనీకాంత్ పారితోషకమే అని టాక్. ఏకంగా 108 కోట్ల రూపాయల పారితోషకాన్ని రజనీకాంత్ ఈ సినిమాకు తీసుకున్నారట. ఇలా దాదాపు 55 శాతం బడ్జెట్ హీరో పారితోషకమేనట! ఇక మిగిలిన బడ్జెట్ తో సినిమా రూపొందించినట్టుగా ఉన్నారు. అందులో దర్శకుడి, హీరోయిన్ పారితోషకాలు కూడా భారీగానే ఉంటాయి. ఏతావాతా పావు వంతు బడ్జెట్ ను అయినా మేకింగ్ మీద ఖర్చు పెట్టారో లేదు.
ఏదేమైనప్పటికీ.. బడ్జెట్ కు తగ్గట్టుగా వసూళ్లు వచ్చి ఉంటే.. చెల్లిపోయేది. కానీ ఈ సినిమాను కొన్న వాళ్లు భారీగా నష్టపోయారట. ఈ నేపథ్యంలో వాళ్లంతా రజనీకాంత్ ను ఆశ్రయించాలని అనుకుంటున్నారట. తమ నష్టాలను భర్తీ చేయాలని వారు కోరనున్నారట. ఏతావాతా ఈ సినిమాతో లబ్ధి కలిగింది రజనీకాంత్ కే ఉన్నట్టుంది. దీంతో ఆయననే వారు పరిహారం అడుగుతారేమో. ఏదో ఒక సినిమాకు రజనీకాంత్ నష్టపోయిన వాళ్లకు పరిహారం చెల్లించినట్టుగా ఉన్నారు. ఆ తర్వాత సీన్ మారింది. ఆ మధ్య ధనుష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సినిమా ఒకటి డిజాస్టర్ అయితే, అప్పుడు డిస్ట్రిబ్యూటర్ల ఆందోళనను పట్టించుకోలేదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు దర్భార్ నష్టాలను భర్తీ చేస్తారా అనేది సందేహాస్పదమే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.