ఈసారి బడ్జెట్ పై ప్రచారం ఓ రేంజ్ లో జరిగింది. ఈసారి వచ్చేది కలల బడ్జెట్ అనే స్థాయిలో బీజేపీ నేతలు, దాని మిత్రపక్షాలు ఊదరగొట్టాయి. కానీ అదంతా బిల్డప్ అనే విషయం ఈరోజు తేలిపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్నీ చిల్లరమల్లర లెక్కలే తప్ప, ఫలానా రంగానికి భారీ కేటాయింపులు జరిగినట్టు ఎక్కడా కనిపించలేదు. దీనికి కొంత, దానికి కొంత అన్నట్టు మాత్రమే కేటాయింపులు జరిగాయి తప్ప.. ఏదో ఒక రంగంపై పూర్తిగా దృష్టి పెడుతూ దానికి అత్యధిక కేటాయింపులు ఇచ్చిన దాఖలాలైతే కనిపించలేదు.
ఆటోమొబైల్ రంగంతో పాటు మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహానికి బడ్జెట్ లో ఎలాంటి ఆశాజనక ప్రకటనలు కనిపించలేదు. పన్నుల్లో మార్పుచేర్పులు మాత్రం ఉద్యోగస్తులకు కాస్త ఊరట కలిగించే అంశం. ఉదాహరణకు 7.5 లక్షల నుంచి 10 లక్షల ఆదాయం ఉండేవారు ఇప్పటివరకు 20శాతం పన్ను శ్లాబులో ఉన్నారు. దీన్నిప్పుడు 15శాతానికి తగ్గించారు. ఇలాంటి చిన్నచిన్న రాయితీలు, మినహాయింపులు ఉద్యోగస్తులకు ఈసారి కలిసొస్తాయి.
గ్రామీణ భారతం, వ్యవసాయ రంగంపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కనిపించినప్పటికీ లోతుల్లోకి వెళ్లి చూస్తే అదంతా అంకెల గారడీ అనే విషయం స్పష్టమౌతుంది. వ్యవసాయ రంగానికి 15 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి ఘనంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు రాష్ట్రాలు తమ స్థాయిల్లో ఇస్తున్న రుణాలతో కలుపుకుంటే.. ఈ లెక్క ఎప్పుడో దాటింది. ఇలాంటి అంకెల గారడీలు బడ్జెట్ లో చాలానే ఉన్నాయి.
రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా ప్రసంగించిన నిర్మలా సీతారామన్.. తన బడ్జెట్ ప్రసంగంలో దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పడానికి, మోడీ ప్రభుత్వ పనితీరు బాగుందని చెప్పడానికి, కొన్ని నీతివాక్యాలు చెప్పడానికే ఎక్కువ సమయం కేటాయించారు తప్పితే.. ప్రభుత్వ ఆర్థిక లక్ష్యాల్ని మాత్రం సూటిగా వెల్లడించలేదు. సమగ్రాభివృద్ధి మంత్రాన్ని పఠించిన అదే నోటితో.. వివిధ రంగాలకు కేటాయింపులు తగ్గిస్తూ ప్రకటనలు చేశారు.
బడ్జెట్ లో కొన్ని కీలక అంశాలు చూద్దాం
– 2020-21లో 15లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు ఇవ్వాలనే లక్ష్యం
– ఉపాధి హామీ పథకాన్ని పశుగ్రాస భూముల అభివృద్ధికి కూడా వర్తింపు
– ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా అదనపు ఆస్పత్రులు
– స్వచ్ఛభారత్ కోసం మరో 12300 కోట్లు కేటాయింపు
– విద్యాభివృద్ధికి 99,300 కోట్లు కేటాయింపు
– ఐదు కొత్త స్మార్ట్ సిటీల అభివృద్ధి
– 2025 నాటికి మరో వంద ఎయిర్ పోర్టులు
– పర్యాటక రంగానికి 2500 కోట్లు
– బ్యాంక్ డిపాజిట్లపై బీమా 5 లక్షలకు పెంపు
– ఎల్ఐసీలో వాటాల విక్రయం
– ఆదాయపు పన్నులో మార్పులు
– ఆధార్ కార్డ్ సహాయంతో ఇనిస్టెంట్ గా పాన్ కార్డ్ జారీ ఏర్పాటు
– చౌక గృహాల నిర్మాణానికి టాక్స్ హాలిడే కొనసాగింపు
– రైల్వే మరింత ప్రైవేటీకరణ.. పీపీపీ పద్ధతిలో మరో 150 రైళ్లు