ఇక సినిమా నిర్మాణం జోలికే వెళ్లకూడదని గతంలో తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరిగిన అంబికా బ్రదర్స్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం జంప్‌జిలానీ. అల్లరి నరేష్ ద్విపాత్రాభినయంతో ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్నారు. ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి కాస్తా మార్కెట్ హైప్ సృష్టించగలిగేలా కొత్తగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమా నైజాం మరియు వైజాగ్ హక్కులను దిల్ రాజు కొన్నారట.
సాధారణంగానే దిల్ రాజు కొనే చిత్రాలకు మార్కెట్ పెరుగుతుంటుంది. సినిమా బాగుంటే తప్ప.. ఆయన తీసుకోరని.. పైగా ఆయన హ్యాండ్ మంచిదని.. డిస్ట్రిబ్యూషన్ చేసే చిత్రాలు హిట్ కొడతాయని రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో గతంలో ఓ పెద్ద హీరోతో దారుణమైన చిత్రం తీసిన అంబికా బ్రదర్స్.. ఆ తర్వాత.. ఇక సినిమాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారట. కానీ కాస్త సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో.. అల్లరినరేష్‌తో కామెడీ సబ్జెక్టును ముట్టుకున్నారు. అది కాస్తా విడుదలకు సిద్ధం అవుతున్న తరుణంలో రెండు ఏరియాలు.. పైగా క్రేజీ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కొనుక్కోవడంతో తాము లాభాల బాట పట్టేస్తామని కాన్ఫిడెంట్‌గా ఉన్నారట మరి!