ఈమధ్య అస్సలు రిస్క్ తీసుకోవడంలేదు నిర్మాత దిల్ రాజు. ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా బడ్జెట్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమాలకు పోవడంలేదు. తెలుగులో అన్నీ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలే తీస్తున్నాడు. అలాంటి దర్శకుడు బాలీవుడ్ కు వెళ్తాడని ఎవరూ ఊహించరు. కానీ దిల్ రాజు బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఇక్కడ కూడా సేఫ్ మంత్రమే జపిస్తున్నాడు ఈ ప్రొడ్యూసర్.
తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఎఫ్2 సినిమాను హిందీలో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు దిల్ రాజు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే తనే సోలోగా ఈ సినిమాను నిర్మించడం లేదు. బోనీకపూర్ తో కలిసి ఎఫ్2 హిందీ రీమేక్ ను పట్టాలపైకి తీసుకొస్తున్నాడు. అనీష్ బజ్మీ దర్శకత్వంలో ఈ రీమేక్ త్వరలోనే అక్కడ స్టార్ట్ అవుతుంది.
అయితే పేరుకు ఇది జాయింట్ వెంచర్ అయినప్పటికీ.. పెద్ద వాటాదారుడు బోనీకపూర్ అని తెలుస్తోంది. కేవలం రీమేక్ రైట్స్ తో పాటు ప్రొడక్షన్ లో 20శాతం వాటాను మాత్రమే దిల్ రాజు సొంతమట. బాలీవుడ్ లో వేస్తున్న తొలి అడుగులు కాబట్టి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఇలా లిమిటెడ్ గా ప్రొడక్షన్ లోకి దిగుతున్నాడట దిల్ రాజు.
అంతా బాగానే ఉంది కానీ ఎఫ్2 సినిమాను యథాతథంగా బాలీవుడ్ లో రీమేక్ చేస్తారా, మార్పులు చేస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టతరాలేదు. ఎందుకంటే ఎఫ్2లో మలిభాగం, బాలీవుడ్ లో ఆల్రెడీ వచ్చేసిన హౌజ్ ఫుల్ సిరీస్ కు చాలా దగ్గరగా ఉంటుంది.
ఎఫ్2 క్లయిమాక్స్ కూడా బాలీవుడ్ జనాలకు కొత్తకాదు. కాబట్టి సెకండాఫ్ మారిస్తేనే బాగుంటుందనేది ఎక్కువమంది సూచన. దీనిపై దిల్ రాజు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అయినా ఈసారి దిల్ రాజు నామమాత్రమే కదా. మార్పులైనా చేర్పులైనా ఇప్పుడన్నీ బోనీ కపూర్ చేతిలోనే.