హారిక హాసిని సంస్థ చాలా పద్దతిగా వుంటుంది. అక్కడ చినబాబు తన లోకం తనదిగా, తన స్నేహితులు, తన సరదాలు తనవిగా వుంటారు. నాగవంశీ ఎంతసేపూ, మాంచి కాంబినేషన్ ఎలా సెట్ చేసుకోవాలా? అన్న తాపత్రయంతో వుంటారు. పిడివి ప్రసాద్ ఎంతసేపూ, ఏ విధంగా ఓ రూపాయి ఎక్కువకు మార్కెట్ చేసుకోవాలా అని చూస్తుంటారు. కానీ ఇలాంటి ట్రయాంగిల్ లోంచి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. దీనిపై ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎప్పటి నుంచో అదే సంస్థలో ఓ సినిమా డైరక్షన్ అవకాశం కోసం వేచి వున్న వ్యక్తి ఒకరు వున్నారట. ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వాలనే వీరూ చూస్తున్నారట. అయితే ఆ కథ వీళ్లకు నచ్చింది కానీ, ఏ హీరోకి చెప్పించినా, ఏదో సమస్యతో ఒకే కావడంలేదు. అయినా పట్టువదలకుండా, ఆ కథను ఎలాగైనా తెరకెక్కించాలని చూస్తున్నారు. హీరోను ఎవరో ఒకరిని సెట్ చేయాలని చూస్తున్నారు.
కానీ సమస్య అక్కడే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ డైరక్షన్ అవకాశం కోసం నిత్యం హారిక హాసిని ఆఫీస్ తో టచ్ లో వున్న ఆ వ్యక్తి అక్కడి సంగతులు అన్నీ, సరదాగా తన ఇండస్ట్రీ సన్నిహితులతో షేర్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో అక్కడి విషయాలన్నీ బయటకు పొక్కుతున్నాయట.
ఈ సంగతి తెలియక, హారిక హాసిని జనాలు ఏం జరుగుతోంది? ఎలా బయటకు వెళ్తున్నాయి? అని కిందామీదా అవుతున్నారట. అసలు లీకువీరులు తమ మధ్యనే వున్నారని తెలియక తలలు పట్టుకుంటున్నారట. ఇప్పుడైనా అక్కడ ఫైర్ వాల్ కట్టి, బ్లాక్ చేస్తారేమో చూడాలి.