Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: నీవెవరో

సినిమా రివ్యూ: నీవెవరో

రివ్యూ: నీవెవరో
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: ఎంవివి సినిమాస్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌
తారాగణం: ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, ఆదర్శ్‌, శివాజీరాజా, తులసి, సత్యకృష్ణన్‌ తదితరులు
కథ: రోహిన్‌ వెంకటేశన్‌
కథనం, మాటలు: కోన వెంకట్‌
సంగీతం: ప్రసన్‌, అచ్చు
కూర్పు: ప్రదీప్‌ ఈ రాఘవ్‌
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
నిర్మాత: ఎం.వి.వి. సత్యనారాయణ
దర్శకత్వం: హరినాథ్‌
విడుదల తేదీ: ఆగస్ట్‌ 24, 2018

సినిమా మొత్తం ఒక మిస్టరీపై ఆధారపడి నడిచేటపుడు సస్పెన్స్‌ తెలియనివ్వకుండా కథ నడిపించడంలోనే సక్సెస్‌ వుంటుంది. మొబైల్‌లోనే వివిధ స్ట్రీమింగ్‌ యాప్స్‌లో ప్రపంచ సినిమాని మొత్తం అరచేతిలో వీక్షించేస్తోన్న నేటితరం ప్రేక్షకులకి మిస్టరీ కథలు చెప్పడం అంత తేలికైన పని కాదు. చిన్న క్లూ ఇచ్చినా ముందుకి, వెనక్కి లింక్‌ చేసేసుకుని గెస్‌ చేసేసే తెలివితేటలున్న ఈతరం ప్రేక్షకులకి అంతుచిక్కని సస్పెన్స్‌ మెయింటైన్‌ చేయాలంటే వారిని అనుక్షణం ఎంగేజ్‌ చేస్తూ, గెస్‌ చేయని విధంగా బిగి సడలని స్క్రీన్‌ప్లేతో కట్టి పడేయాలి.

ఈ లక్షణాలేమీ లేకుండా, ఈ క్లూ క్యాచ్‌ చేయలేకపోతే... దీని ద్వారా కనిపెట్టండి అన్నట్టు అడుగడుగునా సస్పెన్స్‌కి సంబంధించిన క్లూస్‌ ఇచ్చేస్తూ పోయిన 'నీవెవరో' ఆ సస్పెన్స్‌ ఎలిమెంట్‌ మీదే ఆధారపడడం శోచనీయం. సస్పెన్స్‌ మెయింటైన్‌ చేయని పక్షంలో ప్రేక్షకులకి వినోదం మరేదైనా మార్గంలో ఇవ్వగలిగితే అంతో ఇంతో ఉపశమనం. దురదృష్టవశాత్తూ... ఆ సస్పెన్స్‌ ఎలిమెంట్‌ వుందిగా, అదే కొమ్ము కాచేస్తుందనే ధోరణిలో కనీస ఆసక్తి కలిగించని విధంగా ఈ చిత్రాన్ని ఆద్యంతం నడిపించారు. ఆ సస్పెన్స్‌ కాస్తా సెకండ్‌ రీల్‌లోనే గెస్‌ చేసేయగలిగినపుడు ఇక ఈ చిత్రానికి ఉన్న లైఫ్‌ లైన్‌ అక్కడితో తెగిపోయినట్టయింది.

అంధుడైన హీరోకి ఒక యువతి పరిచయమవుతుంది. ఆమె కష్టాల్లో వుందని తెలిసి ఆదుకుందామని అనుకునేలోపే ఆమె దూరమవుతుంది. ఈలోగా అతనికి కళ్లయితే వస్తాయి కానీ ఆమె ఎవరనేది తెలియకుండా పోతుంది. ఆమె ఆచూకీ తెలుసుకోవడం కోసం వెళ్లిన అతడికి ఆమె జాడ దొరికిందా లేదా అనేది కథ. ఈ కథలో కనిపించకుండా పోయిన ఆ యువతికి ఏమైందనేది ఒక్కటే కీలకాంశం కాదు. ఆమె అతడికి ఎలాగైనా కనిపించాలి, తప్పకుండా ఆమెని అతను కలుసుకోవాలి అనే ఆరాటం చూసేవాళ్లకి కలిగించడం కూడా ప్రధానమే. ఒక బ్లయిండ్‌ క్యారెక్టర్‌కి జీవితంలో వెలుగులా వచ్చిన వ్యక్తి దూరమైపోతే, మళ్లీ అతని జీవితం చీకటైపోతే... చాలా ఎమోషనల్‌ పాయింట్‌ ఇది. కానీ దీనిని కాస్తయినా ఎమోషన్‌ రేకెత్తించని విధంగా చాలా సిల్లీగా తీర్చిదిద్దారు.

ఆమె వచ్చి వెళ్లిపోయినా అతని జీవితంలో చెప్పుకోతగ్గ మార్పులేమీ వుండని విధంగా అతని నేపథ్యం వుంటుంది. పేరెంట్స్‌, అతనికి కళ్లు లేకపోయినా పెళ్లి చేసుకుంటాననే స్నేహితురాలు, కళ్లు తప్ప అతనికి లేనిదంటూ ఏమీ వుండదు. దీంతో సదరు 'వెన్నెల' వచ్చి పోయినా అతని జీవితంలో లోటు కనీసం అతని కథ చూసేవాళ్లకి అయితే కనిపించదు. ఇదంతా వదిలేసి కనీసం వారిద్దరూ ప్రేమలో పడేది అయినా టచ్‌ చేసేలా వుంటుందా అంటే అదీ లేదు. రోడ్డు పక్కన పడుకున్న వృద్ధులకి భోజనం పెట్టించే దయాగుణం వున్న నాయికని చూసి.. అదే మనసుతో చూసి హీరో ప్రేమలో పడిపోతాడు.

సరే... ఈ పాయింట్‌ మీద ఎక్కువ స్ట్రెస్‌ చేయడం దేనికని వదిలేసి కనీసం ఆమె ఆచూకీ తెలుసుకోవడం కోసం అతను చేసే ప్రయత్నం, ఆమె వైపుగా అతని ప్రయాణం అయినా సవ్యంగా వుంటాయా అంటే అదీ లేదు. ఇక్కడో కామెడీ క్యారెక్టర్‌కి స్పేస్‌ వుంది చూడండంటూ బలవంతంగా వెన్నెల కిషోర్‌ని అయితే ఇరికించేసారు కానీ బలవంతంగా కామెడీ అయితే పుట్టించలేరుగా. ఏ కారణంతో అయితే కిషోర్‌ని ఇరికించారో అది ఫలించకపోగా సీరియస్‌గా వుండాల్సిన హీరో అన్వేషణ కాస్తా సిల్లీగా మారిపోతుంది. అంతవరకు హీరో క్యారెక్టర్‌ అయినా సిన్సియర్‌గా కనిపిస్తుంది. కానీ కిషోర్‌ రాకతో హీరో పాత్ర కూడా దఢేల్న పడిపోతుంది. కిషోర్‌ ఒక్కడూ చాలడన్నట్టు సప్తగిరిని కూడా తీసుకొచ్చి ఎంత కంగాళీ చేయాలో అంతా చేసేయడంతో ఇన్వెస్టిగేషన్‌ పార్ట్‌ కూడా ఇరిటేటింగ్‌గా మారుతుంది.

ఇక ఊహించిన ట్విస్ట్‌ వచ్చి, ఆల్రెడీ తెలిసి పోయిన సస్పెన్స్‌ వీగిపోవడం ఒక్కటే మిగుల్తుంది. ఆరంభంలో అంధుడిగా ఆది, పతాక సన్నివేశాల్లో తాప్సీల నటన వల్ల 'నీవెవరో' కాస్తయినా గట్టెక్కగలిగింది కానీ వాళ్లు కూడా సరిగా పర్‌ఫార్మ్‌ చేయనట్టయితే ఈ చిత్రం ఇంకెంత దయనీయంగా మారిపోయేదో ఏమో మరి. ఈమధ్య చాలా చిత్రాలకి తన హాస్యంతో ఎక్స్‌ట్రా మైలేజీ ఇస్తోన్న వెన్నెల కిషోర్‌ కూడా సరయిన కంటెంట్‌ ఇవ్వకపోతే తాను కూడా నిమిత్త మాత్రుడినేనని, రైటర్స్‌ ఫెయిలయితే తాను చేయగలిగింది ఏమీ వుండదని దీంతో చాటుకున్నాడు. 'గురు'తో చాలా ఇంపాక్ట్‌ వేసిన రితికా సింగ్‌ ఇలాంటి పాత్రల్లో పూర్తిగా తేలిపోతోంది.

చిన్న బడ్జెట్‌ చిత్రమే అయినా కానీ సాంకేతికంగా క్వాలిటీ అయితే మెయింటైన్‌ చేసారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం మెప్పిస్తాయి. తమిళ చిత్రం అదే కంగళ్‌కి రీమేక్‌ అయిన ఈ కథలోని సెల్లింగ్‌ పాయింట్స్‌ ఏమిటి, ఏ విధంగా డీల్‌ చేస్తే ఈ పాయింట్‌ ఎఫెక్టివ్‌గా వుంటుందనేది గ్రహించడంలో అటు స్క్రీన్‌ప్లే రచయిత, ఇటు దర్శకుడు మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఇప్పుడు ప్రేక్షకులు ఎలాంటివి కోరుకుంటున్నారో అందుకు తగ్గ లక్షణాలున్న కాంటెంపరరీ థీమ్‌ వున్న చిత్రమే అయినా దానిని ఎలా ప్రెజెంట్‌ చేస్తే ఆశించిన రిజల్ట్‌ వస్తుందనేది అంచనా వేసుకోలేకపోవడంతో 'నీవెవరో' ఇటు ఇప్పటి తరానికీ, అటు సగటు మాస్‌ ప్రేక్షకులకీ నచ్చని విధంగా తయారైంది.

బాటమ్‌ లైన్‌: గతి తప్పిన థ్రిల్లర్‌!
-గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?