దేవిశ్రీప్రసాద్.. కేవలం మ్యూజిక్ డైరక్టర్ మాత్రమే కాదు. పాటలు రాస్తాడు, అవసరమైతే ఆ పాట అతడే పాడతాడు. ఇవన్నీ ఒకెత్తయితే.. టాలీవుడ్ లో మరే సంగీత దర్శకుడికి సాధ్యంకాని రీతిలో స్టేజ్ షోలు కూడా ఇస్తుంటాడు. ఒకప్పుడు తను పనిచేసే సినిమాల ఆడియో ఫంక్షన్లలో ఆడిపాడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవాడు. కానీ ఇప్పుడు అదే పనికి ఎక్స్ ట్రా అడుగుతున్నాడు.
రంగస్థలం సినిమాకు సంగీతం అందించాడు దేవిశ్రీప్రసాద్. ఈసినిమా ఆడియోను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈఆడియో ఫంక్షన్ లో స్టేజ్ పై డీఎస్పీతో ఆటపాట ఎరేంజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ పనికి పాతిక లక్షలు డిమాండ్ చేశాడట ఈమ్యూజిక్ డైరక్టర్. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ డైలమాలో పడినట్టు తెలుస్తోంది.
ఒకప్పట్లా ఫ్రీగా స్టేజ్ పై హంగామా చేయడం మానేశాడు దేవిశ్రీప్రసాద్. ఎందుకంటే అతడికంటూ ఇప్పుడో బ్రాండ్ క్రియేట్ అయింది. సెపరేట్ సెటప్ ఉంది. ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే రేంజ్ కు ఎదిగాడు. ఇలాంటి టైమ్ లో ఆడియో ఫంక్షన్లలో ఉచితంగా లైవ్ షో ఇచ్చి తన మార్కెట్ ను చెడగొట్టుకోలేడు. అందుకే ఇలా 25లక్షలు డిమాండ్ చేశాడట.
నిజానికి దేవిశ్రీ ప్రసాద్ కు ఈమధ్య కాలంలో సరైన బ్రేక్ తగల్లేదు. పాటలన్నీ మూసలో కొట్టుకుపోతున్నాయనే రిమార్క్ పడిపోయింది. ఇలాంటి టైమ్ లో రంగస్థలం సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం వచ్చింది ఈసంగీత దర్శకుడికి. దాన్ని వినియోగించుకోవడం మానేసి ఇలా ఎక్స్ ట్రా డిమాండ్ చేయడం ఏం బాగాలేదంటున్నారు కొందరు.