అవతల బాబుగారు.. ఇవతల కేసిఆర్ గారు. మరో ఏణ్ణర్థంలో వచ్చే ఎన్నికలకు ఈ ఇద్దరు పొత్తు పెట్టుకునే అవకాశం కూడా వుంది. ఇలాంటపుడు అవతలాయనను, ఇవతలాయన అవమానించారు అన్న వార్తలు గుప్పుమంటే ఎంత కష్టం. అందుకే అర్జెంట్ గా బాబు గారి అభిమాన మీడియా రంగంలోకి దిగిపోయింది. తమ స్టయిల్ వింత కథనాలు వండి వారుస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ప్రపంచ తెలుగు మహాసభలకు మొట్ట మొదటి తెలుగు రాష్ట్రమయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆహ్వానించలేదు. ఇది వాస్తవం. అధికారికంగా ఇదే వాస్తవం. దీనిపై కొంతమంది పైకి, మరి కొంత మంది లోలోపల విమర్శించారు. దీనికి తోడు కొందరు ఆంధ్రకు చెందిన కవులను కూడా పిలవలేదు. సరే ఎన్టీఆర్ స్మరణ లేదన్నారు. ఆపై అది అధికారుల తప్పిదం అన్నారు.
ఇప్పడు సమస్య ఏమిటంటే, మామూలుగా అయితే ఒకె. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం-తెరాస-జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి విమర్శలు వస్తే, రేపు పొత్తుపెట్టుకుంటే జనం ఏమనుకుంటారు. 'మిమ్మల్ని అవమానించినా మీకు ఏమీ అనిపించదు. వెళ్లి పొత్తు పెట్టుకున్నారు' అని అంటారు. అందుకే పిలవకున్నా, పిలిచారన్నంత బిల్డప్ ఇవ్వాలి.
అందుకే ప్రభుత్వాల అభిమాన, అనుకూల మీడియాలు ఈ ప్రచారానికి తెరతీసాయి.
' అసలు దీన్ని వివాదం చేయాల్సిన అవసరమే లేదని రెండు రాష్ట్రాల అధికార వర్గాలు స్పష్టం చేసాయి'.. అదేదో అధికారికంగానే ప్రకటన ఇవ్వచ్చు కదా?
చంద్రబాబును ఆహ్వానించాలనుకున్న కేసిఆర్ తన శ్రేయోభిలాషుల సాయంతో బాబు వీలును తెలుసుకుని, అప్పుడు ఆ ప్రకారం పిలవాలని అనుకున్నారట. ఇది మరీ చోద్యంగా లేదూ. మహాసభల డేట్ లు ఇవ్వాళ కొత్తగా, ఇప్పటికిప్పుడు పిక్స్ కాలేదు కదా? చాలా కాలంగా ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. మరి అలాంటపుడు అప్పట్లోనే బాబుకు చెప్పి వుంటే ఆయన వీలు చేసుకుంటారు కదా? బాబు గారిని అధికారికంగా కాకుండా, శ్రేయోభిలాషుల ద్వారా ముగింపు సమావేశానికి వస్తారా? అని అడిగితే రాలేను అన్నారట. అందుకే పిలవలేదట. తీరా పిలిచి రాకపోతే అదో ఇష్యూ అయిపోతుందని, ఇక శుభ ఆహ్వానం పంపనే లేదట.
నమ్మబలికించే ప్రయత్నమే తప్ప, నమ్మడానికి ఎక్కడన్నా ఒక్క శాతం ఆస్కారం వుందా ఇందులో? ఈ విధంగా కూడా పిలుపులు వుంటాయా?
అయితే ఒక అందుకు సంతోషించాలి. ఆహ్వానం పంపలేదు అని అన్యాపదేశంగా మీడియా చెప్పకనే చెప్పింది. అంతే కానీ పంపారు, కొరియర్ లో మిస్ అయింది. తప్పు కొరియర్ వాళ్లది అని తోసేయలేదు.
ఏమైనా కాబోయే కాలంలో ఏర్పాటుకాబోయే పొత్తుకు ఈ కవరేజీ ఒక సూచన మాత్రమే.