పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వని రజనీకాంత్ రెండో విడత ఫొటోల కార్యక్రమాన్ని మాత్రం షురూ చేశాడు. ఈనెల 26నుంచి మరోసారి అభిమానులతో సమావేశం అవ్వాలని నిర్ణయించాడు. ఈ మేరకు తమిళనాడులోకి 8జిల్లాలకు చెందిన అభిమానులకు సందేశాలు అందాయి. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి.
డిసెంబర్ 12న తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు రజనీకాంత్. కానీ ఆరోజు అభిమానుల ఎవరికీ దర్శన భాగ్యం కలగలేదు. చివరికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షులకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో ఫ్యాన్స్ అసోసియేషన్ లోని పై స్థాయి క్యాడర్ అలిగింది. అందుకే మలి విడత ఫొటో సెషల్ కార్యక్రమం పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
26నుంచి 31వరకు జరిగే ఈ అభిమానుల సమ్మేళనంలో ఎప్పట్లానే ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేలా ప్రసంగించబోతున్నాడు రజనీకాంత్. ఈసారి తన రాజకీయ రంగప్రవేశంపై రజనీకాంత్ ప్రకటన చేసే ఛాన్స్ ఉందట. దీనికి కొన్ని కారణాలున్నాయి.
కమల్ హాసన్ ఇప్పుడిప్పుడే పొలిటికల్ గా బిజీ అవుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలు చేస్తున్నారు. విశాల్ అయితే ఏకంగా నామినేషన్ వరకు వెళ్లాడు. అది ఫెయిలైనా తన పొలిటికల్ ఎంట్రీపై స్పష్టమైన సంకేతాలిచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంతో ఆలస్యం చేసిన రజనీకాంత్ కచ్చితంగా ఓ ప్రకటన చేస్తాడనే వాదన వినిపిస్తోంది.
మరోవైపు రజనీకాంత్ మాత్రం తన పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. ఈ విడత ప్రసంగాల్లో కూడా ఎప్పట్లానే దేవుడు ఇంకా శాసించలేదని అంటాడేమో.