'సాహో' చిత్రానికి హిందీ బెల్టులో వచ్చిన స్పందన చూసి ఎవరికైనా అనిపించే మొదటి విషయం. ఇంత క్రేజ్ వున్న సినిమాని చేతులారా ఇలా చేసుకున్నారు కదా అని. ఈ చిత్రం ఇలా అవడానికి ఎన్ని కారణాలున్నా కానీ ప్రధానంగా నిందించాల్సింది దర్శకుడు సుజీత్‌ని. 'రన్ రాజా రన్' చిత్రాన్ని సొంత తెలివితేటలతో ఎంటర్‌టైనింగ్‌గా మలచిన సుజిత్ 'సాహో'కి బడ్జెట్ పెరిగే కొద్దీ తన బుర్ర చాలదని అనుకున్నాడు.
సినిమాకి బేసిక్ కథ కావాలని వదిలేసి, హాలీవుడ్ సినిమాలని తలదన్నే రీతిలో దీనిని తీర్చిదిద్దాలని చూసాడు. ఈ క్రమంలో అతను ఎక్కడా ఒరిజినాలిటీ చూపించలేదు. ఫస్ట్ పోస్టర్‌కి 'బ్లేడ్ రన్నర్' పోస్టర్‌ని కాపీ కొట్టడం దగ్గర్నుంచి లాస్ట్ ఫైట్‌లో 'మ్యాడ్ మ్యాక్స్'ని తలపించాలనే ప్రయత్నం వరకు సుజిత్ ఒక్క విషయంలోను తన ముద్ర వేయలేకపోయాడు. 'లార్గో వించ్' కథని కాపీ కొట్టి, అదే చిత్రం ఆధారంగా వచ్చిన 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ అయినా కానీ అది కామెడీగా తీయడం వలన ఫెయిలయిందని, ఇది యాక్షన్ కనుక క్లిక్ అవుతుందని భావించాడు.
సినిమాలో ఏ సీన్ చూసినా ఏదో ఒక హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టినదే కనిపిస్తుంది. అఫ్‌కోర్స్ 'బాహుబలి 2' చూసినా హాలీవుడ్ సినిమాలు, సీరియళ్లు, సిరీస్‌ల నుంచి లిఫ్ట్ చేసిన సీన్లు కోకొల్లలు వుంటాయి. అయితే వాటిని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఎంత ఎఫెక్టివ్‌గా చూపించాలనే దాంట్లో దిట్ట రాజమౌళి. తలా ఒక సినిమా నుంచి కాపీ కొట్టేస్తే సినిమా అయిపోతుందని భావించిన సుజిత్ తన చిత్రానికి తల, తోక లేకుండా పోయిందని గుర్తించకపోవడం సాహో కొంప ముంచింది.