కాన్ఫిడెన్స్ వుండొచ్చు..వుండాలి కూడా. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు. కానీ హీరో బన్నీ క్యాంప్ మాత్రం ఇప్పడు ఓవర్ కాన్ఫిడెన్స్ దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు పోటా పోటీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
ముందుగా జనవరి 12న విడుదల అని బన్నీ 'అలవైకుంఠపురములో' టీమ్ ప్రకటించేసింది. మహేష్ టీమ్ కూడా 12నే విడుదల అని ప్రకటించింది. దాంతో టాలీవుడ్ లో ఉత్కంఠ నెలకొంది.ఆఖరికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మధ్యవర్తిత్వంతో పరిస్థితి చక్కబడింది. 11న సరిలేరు, 12న అల వచ్చేలా వ్యవహారం సెటిల్ అయింది.
కానీ ఇప్పుడు మళ్లీ వ్యవహారం ముదురుతున్నట్లు తెలుస్తోంది. సినిమా చూసుకుని,కాన్ఫిడెన్స్ ను ఓవర్ కాన్ఫిడెన్స్ గా మార్చుకున్న బన్నీ టీమ్ నిర్మాత హారిక హాసిని ప్రమేయం లేకుండానే సినిమాను 10న విడుదల చేసేయాలని డిసైడ్ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీని వెనుక కారణం ఒక్కటే. ఫ్యాన్స్..కలెక్షన్ నెంబర్లు..రికార్డులు. తొలి రోజు రికార్డు రావాలి అంటే సరిలేరు కన్నా ముందు విడుదల కావాలని బన్నీ టీమ్ భావిస్తున్నట్లు బోగట్టా. అయితే ఇలా చేస్తే తమ యూనిట్ కు మాట వస్తుందని, నిర్మాత చినబాబుకు వున్న మంచి పేరు పాడవుతుందని హారిక హాసిని యూనిట్ భావిస్తోంది. ఒకరోజు ఆలస్యంగా విడుదలయినా, థియేటర్ల సమస్య లేదని, ఎక్కువ థియేటర్లు తమకే వుంటాయని ఆలోచిస్తోంది.
కానీ బన్నీ టీమ్ మాత్రం ఇలా ఆలోచించడం లేదు. ప్రీమియర్లు, తొలి రోజు వసూళ్లు తమకే ఎక్కువ వుండాలని చూస్తోంది. దీంతో ఇప్పుడు మల్లగుల్లాలు ప్రారంభమయ్యాయి. ఆఖరికి హారిక హాసిని దిగి వచ్చి కావాలంటే 11నే తమ సినిమా కూడా వేద్దామని, ఒక రోజు ముందుగా అయితే వద్దు అని అంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సాయంత్రానికి ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.