ఆయన బీజేపీలో సుదీర్ఘ కాలంగా ఉన్న నేత. పైగా ఆరేడేళ్ళ పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేతగాను, 2014 ఎన్నికల్లో అనూహ్యంగా విశాఖ ఎంపీగానూ గెలిచి నిలిచిన నాయకుడు.
పాతకాలపు బీజేపీ నేతగా ఉన్న హరిబాబు 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన నుంచి బీజేపీ ప్రెసిడెంట్ పదవిని లాగేసి కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చేశారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర నాయకులు ఎన్నో హామీలు ఇచ్చినా అవి నెరవేరలేదు.
హరిబాబు కేవలం విశాఖకే పరిమితమై స్థానిక కార్యక్రమాలలో అక్కడక్కడ కనిపిస్తున్నారు. బాగా అనుభవం ఉన్న నేత అయిన హరిబాబు ఇపుడు కీలకమైన మూడు రాజధానుల విషయంలో పెదవి విప్పను అంటున్నారు.
పార్టీలో కొత్త పూజారులు తామే అసలైన బీజేపీ వాదులుగా మీడియా ముందుకొచ్చి జబ్బలు చరుస్తూంటే పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉన్న హరిబాబు మాత్రం సైలెంట్ అంటున్నారు.
ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని రాజకీయంగా పదవులు చేపట్టేలా చేసిన విశాఖను రాజధాని చేసే ప్రతిపాదనలపైన కనీసం స్పందిచడంలేదు. మరి హరిబాబుకు విశాఖ రాజధాని కావడం ఇష్టమా. వాళ్ళ పార్టీ స్టాండ్ అయిన అమరావతిలో రాజధానిని అలా ఉంచేయడం ఇష్టమా అన్నది మాత్రం ఎక్కడా బయటకు చెప్పడంలేదు.
మీడియాకు సైతం దూరంగా ఉంటున్న ఈ సీనియర్ నాయకుడు మనో భావాలు ఏంటన్నది ఇప్పటివరకూ వెల్లడి కాకపోవడం విశేషమే. ఏపీ అంతా మూడు తో మూడ్ మార్చుకుంటూంటే రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీకి చాన్నాళ్ళు సారధిగా పనిచేసిన హరిబాబు ఉలుకూ పలుకూ లేకుండా ఉండడం విడ్డూరమే అంటున్నారు.
ఇక హరిబాబుకు రాజకీయ గురువుగా వెంకయ్యనాయుడు పేరును చెబుతారు. మరి వెంకయ్యనాయుడు ఇండైరెక్ట్ గా అమరావతిలో అన్నీ ఉంటే బాగుంటుంది అనేశారు. మరి అదే అభిప్రాయం హరిబాబుది కూడా అవుతుందా అన్న డౌట్లు ఉన్నాయి. ఏది ఏమైన సిసలైన బీజేపీ నేతలు స్పందించకుండా కొత్త కాషాయం బొట్లు హడావుడి చేయడమే ఏపీ బీజేపీలో వింతా. విషాదమూ.