ఎక్స్ క్లూజివ్-మహేష్ సినిమా వివాదం కొలిక్కి

మహేష్ సినిమా వివాదం ముగిసినట్లే. ఇక మరో రౌండ్ చర్చలు మిగిలాయి. అవి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాల మీద కాదు. అందువల్ల ఇక చర్చలు కొలిక్కి వచ్చినట్లే అనుకోవాలి. మహేష్-వంశీ పైడిపల్లి…

మహేష్ సినిమా వివాదం ముగిసినట్లే. ఇక మరో రౌండ్ చర్చలు మిగిలాయి. అవి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాల మీద కాదు. అందువల్ల ఇక చర్చలు కొలిక్కి వచ్చినట్లే అనుకోవాలి. మహేష్-వంశీ పైడిపల్లి సినిమా విషయంలో గత కొన్ని నెలలుగా సాగుతున్న వివాదం దీంతో  ముగిసిపోతుంది. సినిమా ఇక సజావుగా ముందుకు వెళ్తుంది. ఈ మేరకు నిర్మాతలు పివిపి, దిల్ రాజు, అశ్వనీదత్, మహేష్ భార్య నమ్రతల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. మరో రౌండ్ చర్చలు ఈ రోజు పివిపి, దిల్ రాజు, అశ్వనీదత్ ల నడుమ జరుగుతాయి.

మహేష్ బాబు ఇంట్లో నిన్నరాత్రి జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిసినట్లు సమాచారం. ఈ చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు. మహేష్-వంశీ పైడిపల్లి సినిమాకు ఇకపై ముగ్గురు నిర్మాతలు వుంటారు. పివిపి, దిల్ రాజు, అశ్వనీదత్ ముగ్గురు నిర్మాతలుగా వుంటారు. ముగ్గురు సమానంగా పెట్టుబడి పెడతారు. ముగ్గురు సమానంగా లాభాలు పంచుకుంటారు.

సాధారణంగా సినిమాకు రెమ్యూనిరేషన్ ప్లస్ లాభాల్లో సగం వాటా తీసుకునే హీరో మహేష్ బాబు ఈ సినిమా కు లాభాల్లో వాటా తీసుకోరు. రెమ్యూనిరేషన్ కూడా రీజనబుల్ గా తీసుకుంటారు. దీనికి రెండు కారణాలు.  నిర్మాతల్లో ఒకరైన అశ్వనీదత్ ఎప్పుడో ఏళ్ల క్రితం అడ్వాన్స్ ఇచ్చినందున, ఆ మొత్తానికి వడ్డీలు, అప్పట్లో మహేష్ రెమ్యూనిరేషన్ వంటివి దృష్టిలో వుంచుకోవడం అన్నది ఓ కారణం.

అలాగే ముగ్గురు నిర్మాతలకు కలిపి ఒకటే సినిమా చేయాల్సి రావడం అన్నది మరో కారణం.

ఇకపోతే, ఈ సినిమాకి ఒకె అనడం ద్వారా, ఇక పివిపికి మహేష్ బాబు రెండో సినిమా చేయాల్సిన అగ్రిమెంట్ ముగుస్తుంది. అదే విధంగా ఈ సినిమాపై వున్న అన్ని వివాదాలను పివిపి ఉపసంహరించుకుంటారు. అయితే ఈ వివాదం వల్ల పివిపి కి దాదాపు అరకోటి వరకు లీగల్ ఖర్చులు అయినట్లు బోగట్టా. అదేం చేస్తారో చూడాలి.

ఇదిలా వుంటే అశ్వనీదత్ మహేష్ కు ఏళ్లక్రితం ఇచ్చిన అడ్వాన్స్ కు వడ్డీలు ఇప్పుడు కాస్త ఎక్కువే అయినట్లు తెలుస్తోంది. దాన్ని కూడా సినిమా ఖర్చులో వేయాలని ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది. దానికి మిగిలిన ఇద్దరు నిర్మాతలు ఒప్పుకోవాల్సి వుంది. అది ఈ రోజు మీటింగ్ లో డిస్కస్ చేసే అవకాశం వుంది.

మహేష్ సినిమా అంటే ఖర్చు కనీసం వంద కోట్లు దాటుతుంది. కానీ ఈ సినిమాకు 80 వరకు కట్టడి చేసే అవకాశం వుంది. ఎందుకంటే ముగ్గురు నిర్మాతల లాభాలు షేర్ చేసుకోవాలి కాబట్టి. అలా 80 వరకు కట్టడి చేస్తేనే కాస్త లాభాలు కళ్ల చూస్తారు. ఈ సినిమాకు డెహ్రాడూన్, అమెరికా తదితర ప్రాంతాల్లో షూట్ వుంటుంది. అందువల్ల కాస్ట్ కంట్రోల్ కాస్త కష్టమే కావచ్చు.

మొత్తం మీద టాలీవుడ్ లో టాప్ హీరో సినిమా విషయంలో ఈమాత్రం గట్టి పట్టుపట్టగలిగిన నిర్మాత పివిపి నిజంగా మొండి ఘటమే.