ఫ్యాక్ట్ ఫైండింగ్ దేనికి పునాది?

కేంద్రంపై పోరాటం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ అన్న ఒకటి రెండు రోజుల్లోనే మాట మార్చి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేసారు పవన్ బాబు. పోరాటం కాదు, నిజనిర్థారణ చేయడమే. కానీ అలా నిజాలు…

కేంద్రంపై పోరాటం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ అన్న ఒకటి రెండు రోజుల్లోనే మాట మార్చి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేసారు పవన్ బాబు. పోరాటం కాదు, నిజనిర్థారణ చేయడమే. కానీ అలా నిజాలు తేలిన తరువాత అయినా తప్పు ఎవరిదైతే వారిమీద పోరాటం అనివార్యం కదా? అప్పుడయినా జాయింట్ యాక్షన్ కమిటీ అవసరమే కదా? మరి ఆ విషయం పవన్ విస్మరిస్తే ఎలా?

సరే ఆ సంగతి అలా వుంచుదాం? ఫ్యాక్ట్ ఫైండింగ్ లో ఏం బయటకు వస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ భాజపా చెప్పాల్సింది చెప్పింది. దానికి టీడీపీ నాలెడ్జ్ సెంటర్ పాయింట్ టు పాయింట్ సమాధానాలు వదిలింది. ఈసమాధానాలే ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మందుకు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? ఉదాహరణకు రాజధాని నిర్మాణానికి 3500కోట్లు ఇచ్చాం అని వారు, లేదు 1500కోట్లు మాత్రమే ఇచ్చారని వీళ్లు అంటున్నారు. ఇచ్చిన 1500కోట్లకు లెక్కలు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ముందుకు వస్తాయా? టెంపరరీ నిర్మాణాలకే వందల కోట్లు ఖర్చు చేసిన వైనాన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పట్టించుకుంటుందా?

ఓ కనీస రాజధాని అన్నది కేంద్రం బాధ్యత అయితే, కాదు, బాహుబలి సెట్ లాంటి రాజధానికి దానికి నలభై యాభై వేల కోట్లు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం అంటే, ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏమంటుంది? పేదవాడు రోజూ పంచ భక్ష్య పరమాన్నాలు తింటా అంటే ప్రభుత్వం ఇవ్వడం లేదు కదా? తలకు ఇంత అని లెక్కపెట్టి రేషన్ బియ్యం ఇస్తోంది. ఏడాదికి మూడు సార్లు పరమాన్నం వండుకో చాలు అంటోంది. అదే మాదిరిగా కేంద్రం దృష్టిలో రాజధాని వేరు, రాష్ట్రం కలల రాజధాని వేరు. అక్కడ వస్తోంది పేచీ. మరి ఇలాంటపుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏం అంటుంది?

అలాగే ఉత్తరాంధ్రకు వెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చారు అంటోంది రాష్ట్రం. అంతే ఇచ్చి వుండొచ్చు. కానీ ఆ వెయ్యి కోట్లు దేనికి ఖర్చు చేసారు? కేవలం వైజాగ్ సోకులకు ఖర్చు చేసారా?  లేక ఉత్తరాంధ్ర మూడు జిల్లాల మారుమూల ప్రాంతాలకు ఏమైనా విదిల్చారా? అన్నది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చూడగలదా? రాష్ట్రం ఆ వివరాలు అందిస్తుందా?

స్మార్ట్ సిటీల ప్రకటనే తప్ప, వాటికి రూపాయి విదిల్చింది లేదని ఇప్పుడు చెబుతున్నారు. మరి గడచిన మూడేళ్లుగా ఇదే స్మార్ట్ సిటీల నేపథ్యంలో వెంకయ్యనాయుడును ఓ రేంజ్ లో ప్రొజెక్ట్ చేసి, స్మార్ట్ సిటీల విషయంలో ప్రజలను భ్రమలో వుంచిన తెలుగు మీడియా ఏం మాట్లాడుతుంది?

టోటల్ గా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఓకటే చేయగలదు. కేంద్ర అవసరం మేరకు నిధులు ఇవ్వలేకపోయింది. రాష్ట్రం వున్నంతలో నెట్టుకువస్తోంది. అందువల్ల తప్పు కేంద్రానిదే తప్ప రాష్ట్రానిది కాదు అని వీలయినంత సున్నితంగా చెబుతుంది. ఆ విధంగా భాజపాను కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతుంది.

వీలయితే మరి కాసిన్ని నిధులు రాబట్టి, ఆ ఘనత, ఆ క్రెడిట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ సృష్టి కర్త పవన్ ఖాతాలో వేస్తారు. ఇంక ఎపుడైతే ఇలా జరుగుతుందో, ఇక యాక్షన్ కమిటీ అవసరమే వుండదు. ఎప్పుడైతే ఫ్యాక్ట్ ఫైండిగ్ కమిటీ సూచనలకు భాజపా కాస్త కరుణిస్తుందో, ఇక భాజపా-తేదేపా-జనసేన పొత్తుకు అడ్డంకులు వుండవు.

ఇలా కలిసికట్టుగా, అభివృధ్ది కోసం కిందా మీదా అయిపోయే త్రయంగా ఎన్నికల ముందు మీడియా ఈపార్టీలను ప్రొజెక్ట్ చేయడానికి ఇప్పటి నుంచి పునాది రెడీ అవుతన్నట్లు కనిపిస్తోంది తప్ప వేరు కాదు.

పవన్-ఉండవల్లి ఫొటోస్ కోసం క్లిక్ చేయండి