సంచలనం రేకెత్తించిన గర్భిణీ హత్య కేసు చిక్కుముడి వీడిపోయింది. గత 17రోజులుగా సాగుతున్న దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లైంది. సిసి కెమేరా ఆధారాలతో పోలీసులు నిందితులను గుర్తించారు. మృతురాలి వివరాలు తెలుసుకొని హంతకుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఈకేసులో ముగ్గురు అనుమానితులను సైతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన గర్భిణి కేసులో మృతురాలు ఎవరూ అన్న విషయాన్ని తెలుసుకోవడమే కాకుండా.. హంతకుడి వివరాలు సైతం సేకరించారు సైబరాబాద్ పోలీసులు.
గత నెల 28వ తేదీన గచ్చౌబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద ఓ గోనెసంచి కలకలం రేపింది. అందులో ఓ వివాహితను ముక్కలు ముక్కలుగా నరికి ప్యాక్ చేసిన నిందితులు శవాన్ని బొలానికల్ గార్డెన్ వద్ద వదిలివెళ్లారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, ఆమె హత్య జరిగిన సమయంలో 9నెలల గర్భవతి అని.. దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన తరువాతే దుండగులు హత్యచేసి మృతదేహాన్ని ముక్కలు చేశారంటూ ఫోరెన్సిక్ నిపుణులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు.
దీంతో రంగంలోకి దిగిన ఎనిమిది ప్రత్యేక బృందాలు గత 17 రోజులుగా ఈ కేసు మిస్టరీ ఛేదించే పనిలోపడ్డారు… చివరకు మృతురాలి వివరాలే కాదు.. హత్య కేసుకు సంబంధించి ఎవరైనా సమాచారం ఇస్తే లక్షరూపాయల బహుమానం సైతం ప్రకటించారు సైబరాబాద్ పోలీసులు. చివరకు ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తుల సిసి ఫుటేజ్ పోలీసుల చేతికి చిక్కడంతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది.
నాగ్ పూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కొద్దికాలం క్రితం ఉద్యోగం కోసం సిటీకి వచ్చాడు. ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్న అతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లి కూడా అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య నగరానికి వచ్చి వ్యక్తిని నిలదీయడంతో ఆమెపై దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు ఓ నిర్థరాణకు వచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సిద్ధిఖ్ నగర్ ని అర్థరాత్రి చుట్టుముట్టారు. వ్యక్తి నివాసం ఉంటున్న ఇంటి వద్ద ఆరాతీస్తే హత్య జరిగిన మరునాడే అతడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. సిసి ఫుటేజ్ ఆధారంగా చూస్తే బైక్ పై మూట గట్టిన మృతదేహాన్ని బొటానికల్ గార్డెన్ వద్ద పడేసినట్లు ఉంది. దీంతో అతనికి మరోకొరు సైతం సహకరించారని పోలీసులు కనుగొన్నారు.
పరారీలో ఉన్న నిందితుడు పట్టుబడితే అసలు విషయం బయటపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీలైనంత త్వరలో ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.