తన ఇంట్లో వాళ్ల సినిమాల విషయంలోనే దృష్టి సారించడమే కాకుండా… ఔత్సాహిక ఫిల్మ్ మేకర్లను కూడా ప్రోత్సహించే పనిని పెట్టుకొంటోంది రజనీకాంత్ తనయ ఐశ్వర్య. ఒక సూపర్ స్టార్‌కు కూతురిగా.. మరో స్టార్ హీరోకు భార్య.. దర్శకురాలిగా, నిర్మాతగా బిజీబిజీగా ఉన్న ఐశ్వర్య ఇప్పుడు కొత్త వాళ్లకు తగిన ప్లాట్ ఫారమ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఉత్సాహం కొద్దీ షార్ట్ ఫిల్మ్ లను రూపొందించే వారికి గుర్తింపును కల్పించే బాధ్యతను తీసుకొంటోంది.
అందుకోసం ఒక యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించనుంది ఐశ్వర్య. ఈ చానల్లో షార్ట్ ఫిల్మ్‌ను అప్ లోడ్ చేస్తారు. ఈ విధంగా వాటిని రూపొందించిన వారికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుందనమాట. ఎంతైన ఐశ్వర్య ధనుష్ ఆధ్వర్యంలోని యూట్యూబ్ చానల్ కాబట్టి.. దానికి పెద్ద సంఖ్యలో సబ్ స్త్క్రబర్లు ఉంటారు. అనేక మంది సినిమా వాళ్లు కూడా దాన్ని ఫాలో అయ్యే అవకాశంఉంటుంది. దీంతో ఈ చానల్లో షార్ట్ ఫిలిమ్లు ప్రదర్శితం అయితే వాటిని రూపొందించిన వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.
ఈ చానల్‌కు ఎలా పడితే అలా షార్ట్ ఫిలిమ్ లను ప్లే చేయడం కాకుండా.. ప్రత్యేకంగా టీమ్‌ను పెట్టి.. తమ వద్దకు వచ్చే ఎంట్రీలను వడపోసి.. నెలకుకేవలం మూడు సినిమాలను మాత్రమే అప్ లోడ్ చేయనున్నారట. దీన్ని బట్టి సినిమాలను ఎంతగా ఫిల్టర్ చేసి.. బెస్ట్‌ను ఎంపిక చేస్తారో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరి సత్తా ఉన్న ఫిల్మ్ మేకర్లకు ఐశ్వర్య మంచి ఛాన్సే ఇస్తోంది కదా!