ప్రతి సినిమా వంద కొట్టేస్తుందా.?

ఓ తెలుగు సినిమా వంద కోట్ల వసూళ్ళను సొంతం చేసుకోవడం అనేది నిన్న మొన్నటిదాకా కల. ‘బాహుబలి’తో ఆ కల నిజమైంది. జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా పరిశ్రమకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది…

ఓ తెలుగు సినిమా వంద కోట్ల వసూళ్ళను సొంతం చేసుకోవడం అనేది నిన్న మొన్నటిదాకా కల. ‘బాహుబలి’తో ఆ కల నిజమైంది. జాతీయ స్థాయిలో మన తెలుగు సినిమా పరిశ్రమకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది ‘బాహుబలి’ సినిమాతోనే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. సినిమాని మార్కెట్ చేసుకున్న తీరు కావొచ్చు.. సినిమాపై పెరిగిన హైప్ కావొచ్చు.. రాజమౌళి ట్రాక్ రికార్డ్ కావొచ్చు.. కారణం ఏదైతేనేం, ‘బాహుబలి’ సినిమా అంచనాల్ని మించి ‘కమర్షియల్’ విజయాన్ని అందుకుంది. కనీ వినీ ఎరుగని వసూళ్ళతో దుమ్మురేపింది. కేవలం, తెలుగు రాష్ట్రాల్లోనే వంద కోట్ల పైన వసూళ్ళు సాధించిన ‘బాహుబలి’ ఓవరాల్‌గా ఎపడో 200 కోట్లు దాటేసిందని బాలీవుడ్ ట్రేడ్ పండితులే తేల్చేశారు. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్ళను సాధించిన డబ్బింగ్ చిత్రంగా ‘బాహుబలి’ మరో రికార్డుని సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ గురించి చెపకుంటూ పోతే, పెద్ద వ్యవహారమే వుంది. అది కాదిక్కడ విషయం.

‘బాహుబలి’ తర్వాత వచ్చే ప్రతి సినిమాకీ ‘బాహుబలి’తోనే పోలిక పెడ్తున్నారు చాలామంది. వాస్తవానికి ఇప్పటిదాకా వసూళ్ళలో టాప్ ప్లేస్‌లో వున్నది పవన్‌కళ్యాణ్. సినిమా విడుదలకు ముందే పైరసీకి గురైనా ‘అత్తారింటికి దారేది’ వంద కోట్ల వసూళ్ళకు దగ్గరగా వెళ్ళి ఆగిపోయింది. ‘మగధీర’, ‘దూకుడు’.. ఇలా పలు చిత్రాలు తెలుగు సినిమా కమర్షియల్ స్థాయిని పెంచేశాయి. వరుసగా నలభై కోట్లు పైబడి వసూలు చేసిన సినిమాలతో రామ్‌చరణ్ మిగతా హీరోలెవరికీ ఇప్పటిదాకా సాధ్యం కాని రికార్డు కొనసాగిస్తున్నాడు. అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ 50 కోట్లు సాధించిన రెండు సినిమాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తన స్టామినాకి తగ్గ సినిమాలు చేయలేదుగానీ, లేకపోతే మహేష్‌కి వున్న మార్కెట్ అంతా ఇంతా కాదు. ఆ మార్కెట్ పవర్ ఏంటో చూపించడానికి ‘శ్రీమంతుడు’గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు మహేష్. అయినాగానీ, ప్రతి సినిమానీ ‘బాహుబలి’తో పోల్చి చూడలేం.

ఓ ఇండస్ట్రీ హిట్ వచ్చాక, దాన్ని తలదన్నే సినిమా రావడానికి చాలా టైమ్ పడ్తోందన్నది చరిత్రను చూస్తే అర్థమవుతుంది. ‘మగధీర’ రికార్డుల్ని ‘అత్తారింటికి దారేది’ కొట్టాల్సి వచ్చింది. ఈలోగా ఎన్నో హిట్ సినిమాలొచ్చాయి. ఏదీ ‘మగధీర’ను టచ్ చేయలేకపోయింది. అలాగని, మధ్యలో వచ్చిన సినిమాల్ని తక్కువ అంచనా వేయగలమా.? ఆయా సినిమాలపై క్రియేట్ అయిన హైప్, వాటిని మార్కెట్ చేసుకున్న తీరు, అందులోని కంటెంట్.. ఇలా పలు విషయాలు ఆయా చిత్రాల విజయాల్ని శాసిస్తాయి. మళ్ళీ అలాంటి హిట్ మ్యాజిక్ రిపీట్ కావాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. సినీ రంగంలో ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. ‘బాహుబలి’ బిగినింగ్ రికార్డుల్ని ‘బాహుబలి’ రెండో పార్ట్ అధిగమిస్తుందా.? అన్నది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈలోగా ‘శ్రీమంతుడు’ వచ్చేస్తున్నాడు కదా.? అంటే, ‘శ్రీమంతుడు’ జోనర్ వేరు, శ్రీమంతుడిపై వున్న హైప్ వేరు, దాన్ని మార్కెటింగ్ చేసిన తీరు వేరు. అన్నిటికీ మించి ‘శ్రీమంతుడు’ బడ్జెట్ వేరు. ‘బాహుబలి’తో ‘శ్రీమంతుడి’ని ఏ కోణంలోనూ పోల్చి చూడలేం.

కానీ, కాలం కలిసొచ్చి, ‘శ్రీమంతుడు’ సంచలన విజయం సాధిస్తే.? ఏమో, సాధించినా సాధించొచ్చు. కానీ, దానికి వున్న అవకాశాలు తక్కువ. సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు ప్రతి సినిమా విజయవంతమవ్వాలనే కోరుకుంటాడు. తెలుగు సినీ పరిశ్రమ కూడా అంతే. అయినాసరే, ఏడాదికి ఓ బ్లాక్ బస్టర్, నాలుగైదు హిట్ చిత్రాలు, ఫర్వాలేదన్పించే ఓ డజను చిత్రాలు.. ఇదే తెలుగు సినీ పరిశ్రమ గడచిన కొన్నేళ్ళుగా చూస్తున్న సెక్సస్ రేటు. మార్కెటింగ్ అన్నివేళలా పనిచేయదు. హైప్ కూడా అన్ని సందర్భాల్లోనూ సినిమాలకు లాభించదు. స్టార్‌డమ్ అయినా, ఇంకొకటైనా ఓపెనింగ్స్ వరేక. సినిమాలో కంటెంట్ కాస్తయినా వుంటే, దానికి మిగతావన్నీ అదనపు ఆకర్షణలుగా పనికొస్తాయి. అన్నిటికీ మించి టైమ్ కలిసొస్తే సాదా సీదా సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయిపోతుంటుంది. ఏ సినిమా సెక్సస్ అవుతుందో, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో ముందే అంచనా వేయడం కష్టం. అలా అంచనా వేయగలిగితే, అసలు ప్లాప్ సినిమాలనేవే రావు.

ప్రతీదీ బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆశించడంలో తప్పేమీ లేదు. కానీ, ఓ బ్లాక్ బస్టర్‌తో ఇంకో సినిమాని పోల్చాలనుకోవడమే సబబుగా అన్పించదు. ‘బాహుబలి’ బిగినింగ్ నుండి ‘బాహుబలి’ రెండో భాగం వచ్చేలోపు ఎన్నో భారీ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. వీటిల్లో ‘శ్రీమంతుడు’ మాత్రమే కాదు, రామ్‌చరణ్‌తో శ్రీనువైట్ల చేస్తున్న సినిమా, పవన్‌కళ్యాణ్ ‘సర్దార్’, సుకుమార్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా.. ఇలా చాలానే వున్నాయి. వంద కోట్లకు దారి కన్పించింది గనుక, ఏ సినిమాకి ఆ సినిమా మార్కెటింగ్ టెక్నిక్స్ వైపు దృష్టి సారిస్తుంది ‘బాహుబలి’లా. కానీ, అన్నిటికీ ఆ వ్యూహం వర్కవుట్ అవ్వొద్దూ.? పెరిగిన అంచనాలు ఒక్కోసారి సినిమాకి శాపంగా మారతాయి. సో, సినిమాకి అన్నీ కుదిరి.. దానికి టైమింగ్ తోడైతే.. ఇంకో బ్లాక్ బస్టర్‌ని తెలుగు సినీ ప్రేక్షకులు, తెలుగు సినీ రంగం ఈ ఏడాది రుచి చూడొచ్చు. ఆ అవకాశం రావాలనే ఆశిద్దాం.