ఈ మధ్య అడియో ఫంక్షన్లు కరువైపోయాయి. నేరుగా ఆన్ లైన్ లోకి ఒక్కో సింగిల్ వదలడం, సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం అన్నది కామన్ అయిపోయింది. కానీ ఫర్ ఏ ఛేంజ్, ఈసారి ఓ పెద్ద అడియో ఫంక్షన్ జరగబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో హారిక హాసిని సంస్థ నిర్మించే అజ్ఞాత వాసి సినిమా అడియో ఫంక్షన్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో నిర్వహిస్తారు.
డైరక్టర్ త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా 'బయటకొచ్చి చూస్తే..' అనే సాంగ్ ఒకటి సోమవారం అర్థరాత్రి విడుదల చేసారు. కానీ మిగిలినవి ఇలా విడుదల చేయరు. అన్నీ కలిసి ఒకేసారి అడియో ఫంక్షన్ లోనే విడుదల చేస్తారు.
అదే విధంగా పవన్-త్రివిక్రమ్ తమ విదేశీ షూట్ ముగించుకుని, ఈనెల 15తరువాత ఇండియా వస్తారు. వాళ్లు రాగానే అజ్ఞాతవాసి టైటిల్ అనౌన్స్ మెంట్ వుంటుంది. అనుఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ తదితరులు నటస్తున్న ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ అమ్మకాల్లో నాన్ బాహుబలి రికార్డుగా వుండబోతోంది. ఈ సినిమా బిజినెస్ నే 150కోట్ల మేరకు చేసారు.
తమిళ యంగ్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుథ్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. అన్నింటికి మించి, పవన్ కళ్యాణ్ రాజకీయంగా క్రియాశీలకంగా వుండనున్న నేపథ్యంలో, ఇప్పట్లో మరో సినిమా చేస్తారో? చేయరో అన్నది అనుమానంగా వుంది. అలా అయితే కనుక, మరో రెండేళ్ల వరకు పవన్ లేటెస్ట్ సినిమా అంటే అజ్ఙాతవాసి మాత్రమే అవుతుంది.