తెలుగునాట హన్సిక మీద పెద్దగా ఆసక్తి లేదెవ్వరికీ! తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయినా.. హన్సిక ఇక్కడ ఎక్కువ కాలం గ్రిప్ నిలుపుకోలేకపోయింది. ఇదే సమయంలో ఆమె కు తమిళులు బ్రహ్మరథం పట్టారు. లావుగా, తెల్లగా ఉండే వారంటే పడి చచ్చే తమిళులు హన్సికకు గుడి కట్టేశారు! ఆమెను ఆరాధ్య దేవతగా చేసేశారు. దీంతో దాదాపు ఏడెనిమిదేళ్ల నుంచి హన్సిక అక్కడ టాప్ స్టేటస్ లో కొనసాగుతోంది.
అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి అక్కడ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి! ఎంతగా అంటే.. చేతిలో ఒక్క సినిమా కూడా లేనంతగా! ఈ నేపథ్యంలో ఈమె తెలుగు సినిమా ‘లక్కోన్నోడు’ మీద చాలా ఆశలే పెట్టుకుంది. అయితే ఈ సినిమా కాస్త ఎవరికీ పట్టకుండా పోయింది. అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. దీంతో హన్సిక నిరాశ చెందింది!
అటు తమిళంలోనూ సినిమాలు లేవు, తెలుగులోనూ చెప్పుకోదగ్గ స్థితిలో లేదు పరిస్థితి. ఈ నేపథ్యంలో హన్సిక మాట్లాడుతూ తను తిరిగి పుంజుకోలగనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.
ఇదే సమయంలో తన సహనటీమణులు త్రిష, నయనతారల మీద హాట్ కామెంట్స్ చేసింది హన్సిక. వారిలాగా మీరు కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తారా? అని మీడియా అడుగగా.. ‘నాకేం వయసు మీద పడిందని.. అలాంటి సినిమాల్లో నటిస్తాను, నాకు ఇంకా పాతికేళ్లే, త్రిష, నయనతారల్లా ముప్పై దాటాకా వాటి గురించి ఆలోచిస్తా..’ అని బాంబు పేల్చింది ఈ భామ! మరి వాళ్లిద్దరూ ముదిరిపోయిన వాళ్లు అంటూ చెప్పకనే చెప్పింది హన్సిక. మరి ఈ కామెంట్లపై త్రిష, నయనలు మండిపడటం సహజమే గా! అదే జరుగుతోంది మరి.