అజ్ఖాతవాసి సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం ఎంత ఇబ్బందికరమైన ఫీట్ అన్నది తెలిసి వచ్చింది హారిక హాసిని సంస్థకు. తరచు షూటింగ్ క్యాన్సిల్ లు, సెట్ లు, బడ్జెట్ ఇలా ఒకటి కాదు. కానీ ఆయనతో ఆ సంస్థకు బోలెడు అనుబంధం, సాన్నిహిత్యం వుంది.
అందుకే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సందర్భంగా రెండు సినిమాలు చేయబోతుంటే వాటిల్లో ఒకటి హారిక హాసినికి కూడా వుంది. అయితే ఈసారి హారిక హాసిని సంస్థ పవన్ ప్రాజెక్టు కు నిర్మాత దిల్ రాజుతో చేతులు కలిపింది. పింక్ సినిమా రీమేక్ ను మొత్తం దిల్ రాజే చూసుకుంటారు అన్నమాట.
పెట్టుబడి, సినిమా నిర్మాణం, ప్రొడక్షన్ అంతా దిల్ రాజే. ఇక హారిక హాసినికి మరే సంబంధం వుండదు. హ్యాపీగా లాభాల్లో (వస్తే) వాటా తీసుకోవడమే. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో దిల్ రాజు మాదిరిగా అన్నమాట.
డైరక్టర్ కావలెను
ఇదిలావుంటే పింక్ రీమేక్ కు పవన్ ను డైరక్ట్ చేసేందుకు ఓ యంగ్ డైరక్టర్ కావాలంట. ఈ మేరకు నిర్మాత దిల్ రాజు వెదుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది. చిత్రమేమిటంటే పవన్ కు నచ్చిన డాలీ వున్నారు, దిల్ రాజుకు నచ్చిన వేణు శ్రీరామ్ వున్నారు. కానీ వీళ్లు కాకుండా వేరే యంగ్ డైరక్టర్ ఎవరైనా అని వెదుకులాట సాగుతోందని తెలుస్తోంది.