పవన్ ను గుర్రం ఎక్కించడం అంత వీజీనా?

జనసేన పగ్గాలు వదిలేసి గుర్రం పగ్గాలు పడతారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇదీ టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త. దర్శకుడు క్రిష్ కు ఓ సమస్య వుంది. ఆయన తన విషయాలు చాలా…

జనసేన పగ్గాలు వదిలేసి గుర్రం పగ్గాలు పడతారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇదీ టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త. దర్శకుడు క్రిష్ కు ఓ సమస్య వుంది. ఆయన తన విషయాలు చాలా గుట్టుగా వుంచాలనుకుంటారు. కానీ ఆయన టీమ్ లోని ఓ కీలక మెంబర్ పుణ్యమా అని అన్నీ బయటకు అలా వచ్చేస్తుంటాయి. క్రిష్ మాత్రం కిందామీదా అవుతుంటారు.

సరే, అదంతా వేరే సంగతి. ఇంతకీ విషయం ఏమిటంటే, గౌతమీపుత్ర శాతకర్ణి కథ చెప్పి, బాలయ్య దగ్గర వైల్డ్ కార్డ్ ఎంట్రీ సంపాదించినట్లే, ఓ జానపద కథ చెప్పి పవన్ దగ్గర చాన్స్ రాబట్టే ప్రయత్నంలో వున్నారట క్రిష్. మహానాయకుడు దెబ్బకి సినిమా అన్నది లేకుండా అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో పవన్ తో సినిమా కోసం కిందామీదా అవుతున్న క్రిష్, జానపద కథ చెప్పి ఒప్పించారట.

మరోపక్క ఎలాగైనా పవన్ చేత పింక్ రీమేక్ చేయించే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతున్నారు పవర్ స్టార్ నిర్ణయం తీసుకోలేక. నిజానికి పవన్ ఇమేజ్ కు కానీ, పవన్ ఫిజికల్ ఫిట్ నెస్ కు కానీ పింక్ సినిమానే సరిపోతుంది.

ఎందుకంటే పవన్ ఎక్కువగా శ్రమ తీసుకోలేరు. అది అజ్ఞాతవాసి సమయంలో అందరికీ అర్థం అయింది. పైగా పవన్ కు విపరీతమైన నడుంనొప్పి వుందని వార్తలు వున్నాయి. ఇలాంటపుడు గుర్రాలు ఎక్కడం, కత్తి తిప్పడం, పోరాటాలు అంటే పవన్ చాలా శ్రమపడాల్సి వుంటుంది. లేదా సైరాలో మాదిరిగా డూప్ ను, గ్రాఫిక్స్ ను ఎక్కువగా వాడాల్సి వుంటుంది.

పైగా క్రిష్ పని తీరు వేరు. ఆయన చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు. కానీ పవన్ తో సినిమా అంత వీజీకాదు. త్రివిక్రమ్ లాంటి సన్నిహితుడే అజ్ఞాతవాసి టైమ్ లో చాలా ఇబ్బందులు పడ్డారని టాక్. తరచూ క్యాన్సిల్ చేయడం వంటివి జరిగాయి. మరి ఇలాంటి నేపథ్యంలో గుర్రాలు, కత్తులు, చకచకా షూటింగ్ ఎంచుకుంటారో? సింపుల్ గా కోర్టు సీన్ లో వాదనలు వినిపించే ఎఫెక్టివ్ పింక్ ను ఎంచుకుంటారో? చూడాలి.

ఐదేళ్లపాటు నిండా ముంచేశారని ప్రజలు నమ్మారు