సినిమా రంగంతో ఏ మాత్రం బీరకాయపీచు సంబంధం వున్నా, హీరో అయిపోవాలనుకునే కుర్రాళ్లకు లోటు లేదు. అసలు సంబంధం లేకుండానే హీరో కావాలని కలలు కనేవారు బోలెడు మంది. అలాంటిది ఓ టాప్ హీరో బావమరిది అయితే ఇంక ఆశపడడంలో తప్పేం వుంది? అందుకే జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే కూడా హీరో కావాలని అనుకుంటున్నాడేమో? నార్నే ఎస్టేట్స్ నార్నే శ్రీనివాసరావు కుమారుడే ఎన్టీఆర్ బావమరిది అంటే. ఇప్పుడు ఈ కుర్రాడిని హీరో చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి.
మరి ఎన్టీఆర్ కు తెలుసో లేదో, ఎందుకంటే ఎన్టీఆర్ తలుచుకుంటే కాస్త పెద్దగానే లాంచ్ చేయగలరు. లేదూ కుర్రాడు తన స్వంత ఇంట్రస్ట్ తో హీరోగా ఏదోలా ప్రారంభం కావాలి అనుకుంటే అది వేరేగా వుంటుంది. కుర్రాడు ఎలా వుంటాడు అన్నది ఇంకా జనాలకు పెద్దగా పరిచయం లేదు. అలాగే హీరో మెటీరియల్ వుందా లేదా అన్నది కూడా ఇంకా తెలియదు.
ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయని మాత్రం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో టాప్ ఫ్యామిలీస్ నుంచి ఇలా హీరోల పరంపర సాగుతూనే వుంటుందేమో? అయినా హీరోగా పరిచయం కావడానికి పరిచయాలు పనికి వస్తాయి. కానీ ఎవరు వచ్చినా తమ తమ స్టామినా రుజువు చేసుకుంటేనే ఇక్కడ నిలదొక్కుకోగలరు. లేదూ అంటే కొన్ని సినిమాలకే పరిమితం అవుతారు.