కేవలం ఆరోగ్యపరమైన ముప్పులను తెచ్చి పెట్టడమే కాదు, మనుషుల్లోని మానవత్వాన్ని కూడా కరోనా మాయం చేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ మహమ్మారి మనుషుల్లో స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసి, అవతలి మనిషికి సాయంగా నిలవాలనే ప్రయత్నాలను కూడా దెబ్బతీస్తోంది. ఆఖరికి ఇది పల్లెల్లో కొన్ని రకాల ఘర్షణలకు కూడా కారణం అవుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కరోనా విషయంలో పోరాడాల్సింది రోగితో కాదు, వ్యాధితో అని స్వయంగా ప్రభుత్వాల పెద్దలే చెబుతున్నా సామాన్య ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు లోనవుతూ కరోనా సోకిన వారితో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న దాఖలాలు వార్తల్లోకి ఎక్కుతున్నాయి.
కరోనా సోకిన వ్యక్తికి దూరంగా ఉండటం మంచిదే, అసలు ప్రతి మనిషితోనూ భౌతిక దూరం పాటించడం కూడా మంచిదే. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంత మాత్రం తీసుకుంటున్నారో కానీ.. ఎవరికైనా కరోనా సోకిందంటే వారిని వివక్షతో చూడటం, వాళ్లను ఊర్లలోకే రానివ్వకపోవడం కూడా కొన్ని పల్లెల్లో వెలుగు చూస్తూ ఉన్న వార్తలు వస్తున్నాయి.
అనంతపురం జిల్లాలోని ఒక పల్లెకు చెందిన ఒక కుటుంబం గత కొంతకాలంగా బెంగళూరులో ఉంటూ వచ్చింది. తన అబ్బాయి అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండటంతో అతడి తల్లి, అతడి సోదరి బెంగళూరులో ఉంటూ వచ్చారు. బెంగళూరులో ముందుగా వాళ్ల అబ్బాయికకి-కోడలికి కరోనా సోకింది. అక్కడ ఆసుపత్రుల ఖర్చుకే భయపడ్డారో, సొంతూర్లో ఉంటే మంచిదని అనుకున్నారో.. కానీ వాళ్లు అక్కడ నుంచి ఆ భార్యాభర్త ఏపీకి వచ్చారు.
భార్య ఊరికి వెళ్లి ఊరవతల ఉన్న ఒక చిన్న రూమ్ ఉంటూ, ఊర్లోంచి తమకు కావాల్సినవి తెప్పించుకుని చికిత్స పొందుతూ వచ్చారు. ఇంతలో అప్పటి వరకూ బెంగళూరులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి తల్లికి, సోదరికి కూడా కరోనా సోకిందని తేలింది. దీంతో వాళ్లు కూడా సొంతూరి బాట పట్టారు.
కోడలి ఊరికి కాకుండా.. వాళ్లు సొంతూరికి వెళ్లేప్రయత్నం చేయగా, గ్రామస్తులు ఊరి పొలిమేర్లలోనే అడ్డుకున్నారట! ఆల్రెడీ వాళ్లకు కరోనా సోకిందని తెలిసి, వారిని ఊర్లేకే రానివ్వలేదట ఆ ఊరి వాళ్లు! చేసేది లేక ఆ మహిళలు తిరుగుముఖం పట్టి కోడలి ఊరికి వెళ్లి, ఊరవతల వాళ్లు ఉంటున్న రూమ్ లోనే బస చేస్తూ, చికిత్స పొందారని తెలుస్తోంది!
ఇదీ కరోనా వేళ కొన్ని గ్రామాల్లో పరిస్థితి. 80 శాతం మంది కరోనా రోగులను హోం ఐసొలేషన్లో ఉంచి చికిత్స అందించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే పల్లెల్లోనూ, చిన్నచిన్న పట్టణాల్లోనూ కరోనా వైరస్ సోకిన వారిని సాటి వాళ్లు ఆదరించడం లేదు.
అద్దె ఇళ్లలో ఉన్న వారి పరిస్థితి మరీ దారుణం. వీరికి, వీరి బంధువుల్లో ఎవరికైనా కరోనా సోకిందంటే.. వారిని ఖాళీ చేయమంటూ కొంతమంది హౌస్ ఓనర్లు రచ్చ చేస్తున్నారట.
ఇలా కరోనా వైరస్ సోకిన వారి విషయంలో వెలివేసినట్టుగా ప్రవర్తిస్తున్న ఈ జనాలు, మామూలుగా మాత్రం పదే పదే రోడ్ల మీదకు వస్తుంటారు. భౌతిక దూరాన్ని పాటించరు. జాగ్రత్తలు తీసుకొమ్మంటే పట్టనట్టుగా ఉంటారు. అదే ఎవరికైనా కరోనా సోకిందని తెలిస్తే.. వారిని వెలి వేసేస్తున్నారు! ఇదేం తీరు?