సమీకరణ పేరుతో బలవంతంగా భూములు తీసుకున్నన్నాళ్లు అలా అలా స్పందించానా లేదా అన్నట్లు కాలక్షేపం చేసేసారు జనసేన అధినేత పవన్. తీరా ఇప్పుడు సేకరణ అనే సరికి బస్సుమంటున్నారు. నిజానికి ప్రభుత్వానికి కూడా సేకరణ ఇష్టం లేదు.
ఈ సేకరణ, సమీకరణ అంటే చాలా మంది జనాలకు అంతగా తెలియదు. సేకరణ అన్నది ఎప్పటి నుంచో వున్న పద్దతి. దీనికి నోటీసులు ఇవ్వాలి. తీసుకోవాలి. చెల్లింపులు చేయాలి. వాళ్లు కోర్టుకు వెళ్తే పోరాడాలి. అదే సమీకరణ అయితే పైసా ఖర్చు చేయక్కరలేదు. లోపాయికారీగా నయానో, భయానో కాగితంపై సంతకం చేయించుకుంటే చాలు. అందుకే ప్రభుత్వం ఈ విధానం వైపే మొగ్గుచూపుతోంది.
గతంలో ఇక సమీకరణ ఆపేస్తామని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అయినా ఆపలేదు. అప్పట్లోనే సేకరణ చేస్తామని చేయలేదు. పైగా ప్రభుత్వం సేకరణ అన్నపుడల్లా పవన్ వీల్లేదు అంటూ వుంటారు. కావాలంటే సేకరణ గడువులు, పవన్ ట్వీట్ లు చూడొచ్చు. ఇప్పుడు కూడా ప్రభుత్వం సేకరణ కు రెడీగా లేదు. ఏదో విధంగా సమీకరణ చేద్దామనే. పవన్ కూడా అదే అంటున్నారు. సేకరణ వద్దు అంటున్నారు. అంతే కానీ సమీకరణ వద్దు అనడం లేదు..పూర్తిగా మినహాయించమని అనడం లేదు. కావాలంటే ట్వీట్లు స్పష్టంగా చదవండి.
ఇదిలా వుంటే, కృష్ణానది కరకట్ట పైన, దాని దగ్గరగా వున్న భూములు, భవనాలు అన్నీ బడాబాబులవి అని వినికిడి. ఇప్పుడు సేకరణ అంటూ మొదలుపడితే కత్తి వేటు పడేది వాటిపైనే. అందుకే పవన్ నేరుగా ఫైట్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అలా అని వాళ్లను మినహాయించండి అనడం లేదు. అలా అంటే ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు ఆగ్రహిస్తారు.
అందుకే నేరుగా మినహాయించమని అనడం లేదు. సేకరించవద్దు అంటున్నారు. అంటే వీలయితే పరిహారం పెంచి, బేరసారాలతో సమీకరించడం, లేదంటే వదిలేయడం. ఇలా చేస్తే ఇప్పటికే భూములు ఇచ్చిన వారు అన్యాయమైపోతారు. అదే అంటోంది ప్రభుత్వం కూడా.
అయినా పవన్ వీళ్ల కోసం కాకుండా, కట్ట, దాని పక్క వారి కోసం ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగడం అంటే వెనుక ఏదో వుంది అన్న వదంతులు వినిపిస్తున్నాయి. అయితే వాళ్ల కోసం లేదా ప్రభుత్వం తరపున సేకరణ కాకుండా, సమీకరణకే ముందుకు నడిపించడం. ఇలా ఏదో వుంది తప్ప, మరేమీ కాదని పవన్ ట్వీట్లను అంచనా వేస్తున్నారు?