సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో హీరో పవన్ కళ్యాణ్ ఓ కమెడియన్ ను కొట్టి, సెట్ నుంచి బయటకు పంపాడని వార్తలు గుప్పుమన్నాయి. ఆ నటుడు ఎవరో కాదు షకలక శంకర్ అని కూడా వార్తలు వెలువడ్డాయి. దీనికి పవన్ తరపున కానీ, యూనిట్ తరపున కానీ ఎటువంటి ఖండన వెలువడలేదు. ఇష్టం వచ్చినట్లు రాసుకుంటే తాము ఎందుకు ఖండించాలని అనుకుంటే అది వేరు. కానీ అవసరం అయినపుడు ఇలాంటి ఇష్టం వచ్చిన వార్తలను కూడా వారు ఖండిస్తున్నారు కదా?
పోనీ షకలక శంకర్ అయినా తన పరువు డామేజ్ అవుతుందని తెలిసినపుడు అలాంటిదేం లేదని, తన పేరు అనవసరంగా లాగుతున్నారని షకలక శంకర్ అన్నా చెప్పాలి. అది కూడా జరగలేదు. అంటే దీన్ని బట్టి ఈ సంఘటన జరిగిందని, దానిని ఇక కెలకడం ఇరు వర్గాలకు ఇష్టం లేదని అర్థం చేసుకోవాల్సి వస్తోంది.
కొట్టడం పద్దతా?
బాస్ కావచ్చు.. బంటు కావచ్చు.. యజమాని కావచ్చు.. పని వాడు కావచ్చు.. కొట్టడం అన్నది చాలా తప్పు. ఇరిటేట్ చేసి వుండొచ్చు.. తప్పు చేసి వుండొచ్చు.. బయటకు పంపేయచ్చు.. పని ఆపేయచ్చు.. కానీ కొట్టడం అన్నది తప్పు. హీరో సూపర్ మాన్ కావచ్చు టాలీవుడ్ లో. కానీ అలా అని కమెడియన్ మాత్రం బానిస కాదు.
కమెడియన్లకు, చిన్న నటులకు వాయిస్ లేకపోవచ్చు.. వారు ఎదిరించలేక పోవచ్చు. అంత మాత్రం చేత తప్పు ఒప్పైపోదు. ఆ కమెడియన్ డైరక్టర్ ను ఇరిటేట్ చేసి వుంటే వాళ్లు వాళ్లు చూసుకుంటారు. లేదూ అంటే పిలిచి వార్నింగ్ ఇవ్వచ్చు.. పది కాలాలు ఇండస్ట్రీలో వుండాలని ఆ కమెడియన్ అనుకుని సైలెంట్ అయి వుండొచ్చు.. లేదా రివర్స్ అయి వుంటే, హీరో పరువేం అవుతుంది?
టాలీవుడ్ ఎందర్నో చూసింది
ఇండస్ట్రీని శాసిస్తాం, నటులను తొక్కేస్తాం.. మా మాటకు, చేతకు ఎదురు లేదు అనుకునేవారిని ఈ టాలీవుడ్ చాలా మందిని చూసింది. ఎందరో వచ్చారు.. ఎందరో వెళ్లారు.. ఈ రోజు పేర్లు కూడా వినిపించనంత. కానీ మంచితనం మిగిలిపోతుంది. అది గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా?
ఈ ఇన్సిడెంట్ గాలి వార్త అయితే వెల్ అండ్ గుడ్.. కానీ నిజమే అయితే పవన్ ఆ నటుడికి నాలుగు గోడల నడుమ అయినా సారీ చెప్పడం సభ్యత అనిపించు కుంటుంది. అలాగే ఆ నటుడు కూడా డైరక్టర్ కు సారీ చెప్పడం అవసరం. ఎవరి లిమిట్ లో వారు వుండడం కూడా అత్యవసరం.