రుద్రమదేవి సినిమా తరువాత హిరణ్య కశిపుడి కథ మీద దర్శకుడు గుణశేఖర్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు అంత సులువుగా సెట్ మీదకు వెళ్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు రానా ను హీరోగా అనుకున్నారు కాబట్టి, స్క్రిప్ట్ ను అతని తండ్రి సురేష్ బాబుతో ఓకె చేయించుకోవాలి. అది అంత సులువు కాదు. పైగా ఈ కథకు కాస్త భారీగానే ఖర్చు అవుతుంది. ప్రస్తుతం రుద్రమదేవి తరువాత గుణశేఖర్ అంత ఖర్చు పెట్టే పరిస్థితిలో వున్నారా? అన్నది అనుమానం.
కానీ ఇప్పుడు రానా చెప్పినట్లుగా బయటకు వచ్చిన వార్తలు ఈ ప్రాజెక్టు మీద కాస్త క్లారిటీ ఇచ్చాయి. ఈ సినిమాను గుణశేఖర్ డైరక్షన్ లో సురేష్ బాబే నిర్మిస్తారట. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభమవుతుందట.
ఈ మధ్య రానా, వెంకటేష్ సినిమాలను రెమ్యూనిరేషన్ కు బదులుగా సినిమాను సమర్పిస్తూ, సహనిర్మాతగా వుంటూ, సినిమాను తన కంట్రోల్ లో వుంచుకుంటున్నారు. మరి ఆ విధంగా హిరణ్య కశ్యపను సురేష్ బాబు అందిస్తారా? లేక కేవలం గుణశేఖర్ ను డైరక్షన్ కు పరిమితం చేసి, సినిమా మొత్తాన్ని తాను నిర్మిస్తారా? రానానే మరి కొంచెం క్లారిటీ ఇవ్వాలి.