ఏ సినిమా చేసేటప్పుడు ఆ సినిమా టెక్నీషియన్లను ఆకాశానికెత్తేస్తుంటారు నటీనటులు. ఇలాంటి దర్శకుడిని ఇంతవరకు చూడలేదని, ఫలానా నిర్మాతతో పనిచేయడం నా అదృష్టమని, మా మ్యూజక్ డైరెక్టర్ తన కెరీర్ లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడని.. ఇలా చెప్పుకుంటూ పోతుంటారు. రామ్ చరణ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.
వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకుడు బోయపాటి శ్రీనుని ఒక రేంజ్ లో మోసేశాడు చరణ్. ప్రతి హీరో బోయపాటితో ఒక సినిమా అయినా కచ్చితంగా చేయాలని, ఆ కిక్కేవేరని సెలవిచ్చాడు. అంతటితో ఆగిపోలేదు. బోయపాటి డిఫరెంట్ కన్విక్షన్ తో పనిచేస్తాడని, ఊహలకు అందని విషయాలను కూడా నిజంగా జరిగిందా అన్నట్టు చూపిస్తాడని కితాబిచ్చాడు.
ఈ పొగడ్తల్లో పీక్స్ ఏంటంటే.. లార్జర్ దేన్ లైఫ్ స్టోరీస్ ని చాలా కన్విన్సింగ్ గా చెప్పే అరుదైన దర్శకుల్లో బోయపాటి నెంబర్ 1 అన్నాడు రామ్ చరణ్. అరుదైన దర్శకుల్లో బోయపాటి ఒకడు అని ఉంటే సరిపోయేది, అయితే లిస్ట్ లో ఏకంగా నెంబర్ 1 స్థానాన్ని ఇచ్చేశాడు చరణ్.
లార్జర్ దేన్ లైఫ్ స్టోరీస్ గురించి చెప్పుకునేటప్పుడు రాజమౌళిని మర్చిపోయాడు చెర్రీ. రాజమౌళిని మర్చిపోతే పోయే.. ఆయన తీసిన మగధీర సినిమాను కూడా మర్చిపోవడం ఆశ్చర్యం. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన మగధీర లార్జర్ దేన్ లైఫ్ మూవీ కాదా.
బాహుబలితో బాలీవుడ్ ని కూడా గడగడలాడించి, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి నెంబర్ 1 దర్శకుడు కాదా? ఎంత బోయపాటి సినిమాలో నటించినా, ఆయన డైరక్షన్ పై ప్రశంసలు కురిపించాలని డిసైడ్ అయినా మరీ ఉత్తమోత్తముడు అనేయడం ఏం బాగాలేదు. ఇది కచ్చితంగా మిగతా దర్శకులని కించపరచినట్టే లెక్క.
ఆ మధ్య అంతరిక్షం ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నలుగురు దర్శకులే దిగ్గజాలు అని చెప్పి విమర్శలు ఎదుర్కొన్న చరణ్, ఈసారి బోయపాటిని నెంబర్ 1 దర్శకుడిని చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.