రోజులు ఎప్పుడూ ఒక్కలా వుండవు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే కమ్మవారి ఆదిపత్యం. దాసరి రావడంతో సీన్ చాలా వరకు మారింది. మెగా క్యాంప్ అన్నది బలంగా రూపొందడంతో హీరోల పరంగా ఇండస్ట్రీ అటు ఇటు సగం అనట్లు మారింది. అయితే ప్రభుత్వాల మీద పట్టు, ప్రభావం చూపడం మాత్రం కమ్మవారి చేతుల్లోనే వుంటూ వస్తోంది.
కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ ఆదిపత్యానికి గండి పడింది. అక్కడి నుంచి ప్రభావం చూపించగల వర్గంగా రెడ్డి సామాజిక వర్గం మారుతుందని అనుకున్నారంతా. వైకాపాతో బంధాలు వున్న నిర్మాత దిల్ రాజు తొలిసారి జగన్ పదవీ స్వీకార సభకు వెళ్లి వచ్చారు. యువి వంశీ రెడ్డి, దర్శకుడు మహీ రెడ్డి, ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి వంటి వారు ఇండస్ట్రీ తరపున జగన్ దగ్గర చక్రం తిప్పే పరిస్థితి కనిపించింది.
కానీ వకీల్ సాబ్ తరువాత దిల్ రాజు ప్రాభవం అధికారపార్టీలో తగ్గింది. మిగిలిన వారికి యాక్సెస్ వున్నా కూడా మాట చెల్లుబాటు కనిపించలేదు. ఇలాంటి నేపథ్యంలో మంత్రి పేర్ని నాని కీలకంగా మారారు. దాంతో బంతి కాపు సామాజిక వర్గం చేతిలోకి వచ్చినట్లు కనిపిస్తోంది.
ఆర్ నారాయణ మూర్తి, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు సినిమా ఇండస్ట్రీ సమస్యల విషయంలో కీలక పాత్ర వహించే సూచనలు క్లారిటీగా కనిపిస్తున్నాయి. పేర్ని నాని ఇండస్ట్రీలో అందరివాడుగా కనిపిస్తున్నా, వ్యవహారశైలి మాత్రం కాస్త భిన్నంగానే వుంటోంది. ఆయన తెలివిగా వ్యవహారం చక్కబెట్టగలరు. హీరో నాని సినిమా పరిశ్రమపై ఆంధ్ర వైఖరికి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన తరువాత వెంటనే జరిగిన సినిమా ఫంక్షన్ కు ఆర్ నారాయణ మూర్తిని ప్రత్యేకంగా ఆహ్యానించడం విశేషం.
ఆర్ నారాయణ మూర్తి సినిమాను చూసి ప్రశంసించారని అందుకే ఆహ్వానించినట్లు యూనిట్ వర్గాలు చెప్పాయి. కానీ వేదిక మీద ఆర్ నారాయణ మూర్తిని అసలైన శ్యామ్ సింగ రాయ్ అని ఆకాశానికి ఎత్తేసారు. ఆయన ఐడియాలజీ, సినిమాలు ఆ విధంగానే రివల్యూషనరీ తో వుంటాయి కనుక ఎవరికీ కొత్తగా అనిపించలేదు.
అదే వేదిక మీద సినిమా థియేటర్ల గురించి మాట్లాడడం, ఆ తరువాత ఆయన ఇండస్ట్రీ సమస్యల మీద మంత్రిని కలవడం ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఎక్కువగా ఇలాంటి విషయాల్లో ఆయన పెద్దగా జోక్యం చేసుకోరు. అలాగే ఈ కులాలు వ్యవహారాలు ఆయనకు పెద్దగా పట్టినట్లు వుండరు. చిత్రంగా ఆయన కలిసిన తరువాతే సీజ్ చేసిన థియేటర్లకు నెల గడువు దొరికింది.
ఇదిలా వుంటే రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీలో ఓ సభ్యుడి పేరును కాపు నేత ముద్రగడ పద్మనాభం రికమెండ్ చేసారనే టాక్ వినిపిస్తోంది. ఓ సభ్యుడిని నేరుగా మంత్రే ఇష్టపడి నియమించుకున్నారని తెలుస్తోంది.
ఇప్పడు టికెట్ రేట్ల వివాదం కూడా కొలిక్కి రావాల్సి వుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు సుముఖంగానే వుంది. వైకాపా నాయకుడు సజ్జల ఈ మేరకు చాలా వరకు గ్రౌండ్ ప్రిపేర్ చేసి వున్నారని వార్తలు వినవస్తున్నాయి. .
ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు టాలీవుడ్ సమస్యల పరిష్కారం, టాలీవుడ్ లీడర్ షిప్ అంతా చేతులు మారుతున్నట్లు క్లారిటీగా కనిపిస్తోంది.