పక్కింటి కుర్రాడు, నేచురల్ స్టార్.. ఇలా నానిని ఓన్ చేసుకుంది తెలుగు సినీ ప్రేక్షక లోకం. తనకి సూట్ అయ్యే కథలు ఎంచుకుని ఎంటర్టైనర్స్తో ఆకట్టుకుంటూ, వరుస విజయాలు అందుకుంటోన్న నాని నెమ్మదిగా తన రూట్స్ మర్చిపోతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
తన బలాలని విడిచిపెట్టి కమర్షియల్ స్టార్ జోన్లోకి వెళ్లడానికి తొందర పడుతున్నాడని, ఎనభైల తరహా కథల్ని ఎంచుకుని మాస్ హీరో అవ్వాలని చూస్తున్నాడని అతని సినిమాలు చూస్తున్నవారు అంటున్నారు.
'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలో ఈ పోకడలు బాగానే కనిపించాయి. దిల్ రాజు పబ్లిసిటీ హంగామాకి తోడు సాయి పల్లవి పట్ల యూత్‌లో వున్న క్రేజ్ తోడయి 'ఎంసిఏ' చిత్రం వీక్నెస్ని అధిగమించి విజయం సాధించింది.
దాంతో ఇంకాస్త కాన్ఫిడెన్స్ పెరిగి ఈసారి ఫక్తు కమర్షియల్ సినిమాతో వచ్చేసాడు. ద్విపాత్రాభినయం చేసిన 'కృష్ణార్జున యుద్ధం' చూస్తే ఎనభై, తొంభైవ దశకాల్లో చిరంజీవి చేసిన సినిమాలు తలపుకొస్తాయి.
విపరీతమైన యాక్షన్, పంచ్ డైలాగులు, మాస్ మసాలా అంశాలతో నాని చిత్రాల నుంచి నేచురల్‌గా ఆశించేవి తక్కువై, రొటీన్ పోకడలు ఎక్కువై ఈ చిత్రం నిరాశపరుస్తోంది. ఎంసిఏతో పోలిస్తే ఓపెనింగ్ వీక్‌గా రావడంతో నాని వీక్నెస్లు బహిర్గతమవుతున్నాయి.
అతను ప్రస్తుతం ఎంచుకుంటోన్న కథల్లో చాలా వరకు కమర్షియల్ సూత్రాలకి దగ్గరగా వుంటున్నాయనే టాక్ వినిపిస్తోంది. తనకి స్టార్డమ్ తెచ్చిపెట్టిన ఇమేజ్‌ని కాదని మాస్ జనాల కోసం నాని దీనిని కంటిన్యూ చేస్తాడా లేక మేలుకొని తన బలాలకి కట్టుబడతాడా అనేది చూడాలి.