సినిమా రివ్యూ: మెర్క్యూరీ

రివ్యూ: మెర్క్యూరీ రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌ తారాగణం: ప్రభుదేవా, సనత్‌ రెడ్డి, దీపక్‌ పరమేష్‌, శశాంక్‌ పురుషోత్తమ్‌, అనీష్‌ పద్మనాభన్‌ తదితరులు కూర్పు: వివేక్‌ హర్షన్‌ సంగీతం: సంతోష్‌ నారాయణ్‌…

రివ్యూ: మెర్క్యూరీ
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌
తారాగణం: ప్రభుదేవా, సనత్‌ రెడ్డి, దీపక్‌ పరమేష్‌, శశాంక్‌ పురుషోత్తమ్‌, అనీష్‌ పద్మనాభన్‌ తదితరులు
కూర్పు: వివేక్‌ హర్షన్‌
సంగీతం: సంతోష్‌ నారాయణ్‌
ఛాయాగ్రహణం: ఎస్‌. తిరు
నిర్మాతలు: కార్తికేయన్‌ సంతానం, జయంతిలాల్‌
రచన, దర్శకత్వం: కార్తీక్‌ సుబ్బరాజ్‌
విడుదల తేదీ: ఏప్రిల్‌ 13, 2018

'పిజ్జా', 'జిగరదండా' లాంటి ప్రయోగాత్మక, ప్రశంసాత్మక చిత్రాలను రూపొందించిన తమిళ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈసారి ఇంకో ప్రయోగం అటెంప్ట్‌ చేసాడు. 'సైలెంట్‌ ఫిలిం' అంటూ మార్కెట్‌ చేసిన 'మెర్క్యూరీ' నిజానికి సైలెంట్‌ మూవీ కాదు. సౌండ్‌ ఎఫెక్ట్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రధానంగా సాగే ఈ థ్రిల్లర్‌ డైలాగ్స్‌ లేని చిత్రం. మాటల్లేని ఈ చిత్రం పలు హాలీవుడ్‌ థ్రిల్లర్స్‌ని తలపించే సెటప్‌తో రెగ్యులర్‌ సినిమాల మధ్య విభిన్నంగా అనిపిస్తుంది. అయితే ఈ తరహా చిత్రాలని మనవాళ్లు అటెంప్ట్‌ చేయలేదని కాదు. 'ఏ ఫిలిం బై అరవింద్‌' ప్లాట్‌కి దగ్గరగా వున్న ఈ కథపై గత యేడాది వచ్చిన హాలీవుడ్‌ థ్రిల్లర్‌ 'డోంట్‌ బ్రీథ్‌' ఇన్‌ఫ్లుయన్స్‌ బాగా కనిపిస్తుంది.

స్లాషర్‌/హారర్‌ జోనర్‌కే చిన్న ట్విస్ట్‌ ఇచ్చి డైలాగ్స్‌ లేకుండా రూపొందించడంతో ఇది కాస్త వెరైటీగా అనిపిస్తుంది. అయితే మాటలు లేవనేది మాత్రం పక్కన పెడితే సగటు థ్రిల్లర్‌కీ, ఈ చిత్రానికీ పెద్ద వ్యత్యాసమేం వుండదు. కార్పొరేట్‌ వ్యవస్థ వల్ల పర్యావరణం నాశనం అయిపోతుందనే థీమ్‌ అంతర్లీనంగా వున్నా, ప్రధానమైన ఫోకస్‌ మొత్తం ఒక మూసి వేసిన ఫ్యాక్టరీలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఓ శక్తి బారిన పడిన అయిదుగురు స్నేహితులు ఏమవుతారు? బయటకి వెళ్లే మార్గం లేని ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ నుంచి ఎంత మంది సురక్షితంగా బయటపడతారు అన్నదానిపైనే వుంటుంది.

నిడివి చాలా తక్కువైన ఈ సినిమాలో పాత్రల పరిచయం, వారి మధ్య అనుబంధం ఎస్టాబ్లిష్‌ చేయడానికే దర్శకుడు చాలా సమయం కేటాయించాడు. బధిరులు అయిన అయిదుగురు స్నేహితులు చాలా కాలం తర్వాత రీయూనియన్‌ ఏర్పాటు చేసుకుంటారు. పార్టీ చేసుకున్న అనంతరం సరదాగా బయటకి వెళ్లిన వారికి ఓ దుస్సంఘటన ఎదురవుతుంది. దానికి పరిష్కారం కనుగొన్నా మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితుల్లో వారు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.

దర్శకుడు సుబ్బరాజ్‌ తన ఊహాశక్తికి రెక్కలు తొడిగి వివిధ అంశాలని ఈ కథలోకి చొప్పించాడు. సూపర్‌ నేచురల్‌ ఎలిమెంట్‌ వున్నా కానీ సగటు హారర్‌లా కాకుండా హోమ్‌ ఇన్వేషన్‌ తరహాలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. సౌండ్‌ డిజైన్‌, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్‌ డిజైన్‌ అద్భుతంగా కుదిరిన ఈ చిత్రం ఆసక్తికరంగానే అనిపిస్తుంది కానీ తగినంత థ్రిల్‌ చేయడంలో విఫలమైంది. టెన్షన్‌ బిల్డ్‌ చేసే సన్నివేశాలు ఎక్కువ లేకపోవడం, సింగిల్‌ డైమెన్షనల్‌గా చాలా సన్నివేశాలు ఒకే తరహాలో అనిపించడంతో షాక్‌ వేల్యూ లేకుండా పోయింది.

ఒకటి, రెండు సన్నివేశాలు మినహా ఎక్సయిట్‌ చేయలేకపోయిన ఈ థ్రిల్లర్‌ వ్యూయర్‌పై ఎలాంటి ఇంపాక్ట్‌ వేయలేకపోతుంది. భయం కలిగించడం, టెన్షన్‌ పడేట్టు చేయడం, అన్నిటికీ మించి ఆ పాత్రల పట్ల సింపతీ కలిగించడంలో దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ విఫలమయ్యాడనే చెప్పాలి.

ప్రాణాలు ప్రమాదంలో వున్నాయన్నపుడు, దాని చుట్టూనే టెన్షన్‌ బిల్డ్‌ అవ్వాలన్నపుడు సదరు పాత్రలతో కనక్ట్‌ ఏర్పడాలి. ఆ పాత్రల పరిచయానికి దర్శకుడు ఎక్కువ సమయమే కేటాయించాడు కానీ చివరకు ప్రేమ జంటతో సహా ఎవరితోను రిలేట్‌ చేసుకోలేని తరహాలో కథనం సాగుతుంది. మాటల్లేక పోవడం వారంతా కేవలం సౌంజ్ఞల ద్వారా కమ్యూనికేట్‌ చేసుకోవడం, వారు కమ్యూనికేట్‌ చేసుకునేది ఏమిటో చాలా వరకు మనకి అర్థం కాకపోవడంతో ఈ 'సైలెంట్‌ ఫిలిం' ప్రయోగం వికటించినట్టయింది.

ప్రమాదంలో వున్న వారికి ఒక లోపం వున్నట్టే, ఆ 'ప్రమాదానికి' కూడా ఒక లోపం పెట్టడం జరిగింది. ఇది రివీల్‌ అయినపుడు ఎక్సయిటింగ్‌గా వున్నా కానీ ఆ తర్వాత ఫాలో అయ్యే సన్నివేశాలు ఇమాజినేటివ్‌గా, క్రియేటివ్‌గా లేకపోవడంతో చాలా సాధారణ వ్యవహారమైపోయింది. పిజ్జా చిత్రంలో అంతగా థ్రిల్‌ చేసిన దర్శకుడు ఈసారి ఆ తరహా మ్యాజిక్‌ రిపీట్‌ చేయలేకపోయాడు. అసలేం జరిగిందనే బ్యాక్‌స్టోరీ కూడా ఏమంత థ్రిల్‌ చేయకపోగా, కేవలం లూజ్‌ ఎండ్స్‌ అన్నీ కలుపుకుపోయిన ఫీల్‌నిస్తుంది.

ప్రభుదేవా మేకప్‌ భయంగొలుపుతుంది కానీ అతని నటన గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. తన నటన ఎంత భయపెడితే అంత భయం కలిగించే విధంగా రాసుకున్న సన్నివేశాల్లో ప్రభుదేవా ఏ దశలోను ఆ ఎఫెక్ట్‌ తీసుకు రాలేకపోయాడు. స్నేహితులుగా నటించిన వారంతా భయాన్ని బాగా అభినయించారు. ఇందుజ నటన మెప్పిస్తుంది. రమ్య అతిథి పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులే హీరోలయ్యారు. తిరు సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలిచింది.

లైటింగ్‌తో, కెమెరా యాంగిల్స్‌తో ప్రేక్షకులని కథ జరుగుతోన్న ఫ్యాక్టరీ మధ్యలోకి వెళ్లిన ఫీల్‌ తీసుకురాగలిగాడు. అలాగే సంతోష్‌ నారాయణ్‌ అందించిన నేపథ్య సంగీతం చాలా సందర్భాల్లో సన్నివేశాల్లో లేని టెన్షన్‌ని బిల్డ్‌ చేయగలిగింది. ఆర్ట్‌ డైరెక్టర్‌, ఎడిటర్‌ కూడా చక్కని ప్రతిభ చూపించారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌కి వచ్చిన ఐడియా ఎక్సయిట్‌ చేసేదే అయినా ఎగ్జిక్యూషన్‌ పరంగా నిరాశపరిచాడు. కొన్ని సందర్భాలలో మెరుపులు చూపించినప్పటికీ ఓవరాల్‌గా ప్రేక్షుల అంచనాలకి తగ్గ థ్రిల్లర్‌ని అయితే అందించలేకపోయాడు. 

బాటమ్‌ లైన్‌: థ్రిల్‌ ఇవ్వని సైలెన్స్‌!

– గణేష్‌ రావూరి