మే నెలలోనే విడుదల కావాల్సిన 'దువ్వాడ జగన్నాథమ్' ఇప్పుడు 'బాహుబలి'కి దూరంగా జూన్ 23న విడుదలకి సిద్ధమవుతోంది. అల్లు అర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్… ఇలా అందరూ హేమాహేమీలే వున్నా కానీ బాహుబలి తర్వాత వచ్చే పెద్ద సినిమా ఇదే కనుక ఎక్కడ పోలికలు వస్తాయోననే కంగారు ఈ చిత్ర వర్గాలని పీడిస్తోంది.
మే 19నే విడుదల చేద్దామని అనుకున్న దిల్ రాజు 'బాహుబలి' జోరుని ఊహించే దీనిని వెనక్కి నెట్టినట్టున్నాడు. ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం కనుక దీనినుంచి బాహుబలి మాదిరి విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఆశించరనే చిత్ర బృందం ఆశిస్తున్నారు. ఎటుపోయి ఎటు వచ్చినా కానీ వినోదం పాళ్లు తగ్గకుండా చూసుకుంటే ప్రేక్షకులు సంతృప్తితో బయటకి వెళతారని, కామెడీ డోసు పెంచుతున్నారు.
కామెడీ, యాక్షన్ సమానంగా వున్న ఈ చిత్రంలో రీసెంట్‌గా కొన్ని కామెడీ సీన్లు యాడ్ చేసారట. ఎక్కువ వినోదాన్ని అందిస్తే కథ సరిపడా లేదు, రొటీన్‌గా వుంది లాంటి కామెంట్లని తప్పించుకోవచ్చునని అనుకుంటున్నారట. ఎలాగో డిలే అయింది కనుక దీనిని ప్రొడక్టివ్‌గా మార్చుకుని, ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్‌తో పాస్ అయిపోవాలని చూస్తున్నారట. మొత్తానికి బాహుబలి అందరిలోను తెలియని ఇన్‌సెక్యూరిటీ క్రియేట్ చేసింది. ఒక రెండు, మూడు రెగ్యులర్ సినిమాలు వచ్చి రొటీన్‌లో పడితే తప్ప ఈ భయం పోయేలా లేదు.