మన దేశంలో ఏదైనా కేసులో కోర్టులు ఉరిశిక్ష వేసినప్పుడల్లా వివాదం చెలరేగుతూనే ఉంటుంది. తీవ్రాతితీవ్రమైన నేరాల్లో ఉరిశిక్ష వేయడం న్యాయమనేవారున్నారు. ఎంత తీవ్ర నేరం చేసినా ఉరిశిక్ష వేయకూడదని, అది అమానుషమని వాదించే వారున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన నిర్భయ కేసులో మిగిలిన నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిచడం సరైందేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంలో పాక్ ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్‌ను ఉరి తీసినప్పుడు కూడా ఉరిశిక్ష సమర్థకులకు, వ్యతిరేకులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. తీవ్ర నేరాల కేసులను విచారించే ధర్మాసనంలోని న్యాయమూర్తుల్లోనూ ఉరిశిక్ష సమర్థుకులు, వ్యతిరేకులు ఉన్నారు. తీర్పు ఇచ్చే ధర్మాసనంలోని మెజారిటీ న్యాయమూర్తులు ఏ అభిప్రాయం వెలిబుచ్చితే చివరకు అదే ఖరారవుతుంది. నిర్భయ (అసలు పేరు జ్యోతిసింగ్) కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకడు జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనారిటీ తీరనివాడు (నేరం జరిగిననాటికి) కాబట్టి జువనైల్ హోమ్‌కు పంపారు. మిగిలిన నలుగురికి శిక్ష పడింది. ట్రయల్ కోర్టు, హైకోర్టు తీర్పులతో సుప్రీం కోర్టు ఏకీభవించడంతో ఉరిశిక్ష సమర్థకులు సంతోషించారు.
కాని మన దేశంలో తీర్పు ఇవ్వగానే ఉరిశిక్ష అమలు జరగదు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా కూడా మారొచ్చు. ఉరిశిక్ష అమలు జరిగినా, అది యావజ్జీవ శిక్షగా మారినా ఇంకా కొన్నేళ్లు పడుతుంది. 2012 డిసెంబరులో జరిగిన నిర్భయపై అత్యాచారం కేసులో 2017 మేలో సుప్రీం కోర్టు తీర్పు రావడం ఆశ్చర్యకరమే. ఐదేళ్లలో తుది తీర్పు రావడం విశేషమేనని మీడియా పండితులు, న్యాయనిపుణులు అంటున్నారు. దశాబ్దాల తరబడి విచారణ జరిగిన కేసులు అనేకమున్నాయి. నిర్భయ కేసులో ఉరిశిక్ష ఇప్పుడిప్పుడే అమలు జరగదని కచ్చితంగా చెప్పొచ్చు. దోషుల తరపు న్యాయవాదులు ఉరిశిక్షను వ్యతిరేకిస్తున్నారు. ఈ శిక్ష అమానవీయమని అంటున్నారు. ఇక మానవ హక్కుల, పౌర హక్కుల సంఘాల సంగతి చెప్పేదేముంది. దోషుల తరపు న్యాయవాదులు మరో సెంటిమెంటు కూడా తెర మీదికి తెచ్చారు. దోషులు పేదలు కాబట్టి వారికి ఉపశమనం కలిగించాలని అంటున్నారు. మన దేశంలో పేదరికాన్ని, కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని శిక్షలను వ్యతిరేకిస్తుంటారు.
రాజకీయ నాయకులు కొందరు నేరాలు చేసి కేసుల్లో ఇరుక్కోగానే 'నేను దళితుడిని కాబట్టే నన్ను కేసులో ఇరికించారు' అని వీరంగం వేస్తుంటారు. పోనీ వీరు పేద దళితులా? కాదు. కోట్లకు పడగెత్తినవారు. వీరు నేరాలు చేసి కులం కార్డుతో తప్పించుకోవాలని చూస్తుంటారు. నిర్భయ కేసులోని దోషులు పేదలైవుండొచ్చు. కాదనం. కాని వారు నేరం తెలియక చేయలేదు కదా. ఉద్దేశపూర్వకంగా, అమానుషంగా, పైశాచికంగా చేశారు. నేరం చేసేటప్పుడు 'మనం పేదవాళ్లం కదా. కేసులో ఇరుక్కుంటే ఎలా?' అని ఎందుకు ఆలోచించలేదు? నిందితులు పేదవారు కాబట్టే ప్రభుత్వం వారి తరపున వాదించడానికి న్యాయవాదులను ఏర్పాటు చేసింది. ఇంకేం కావాలి? ఉద్దేశపూర్వకంగా చేసే తీవ్ర నేరాల్లో పేదరికాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? ఇదిలా ఉంచితే, దోషుల తరపు న్యాయవాదులు ఉరి శిక్ష తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పారు. ఇలాంటి అవకాశం మన న్యాయ వ్యవస్థలో ఉంది. రివ్యూ పిటిషన్ తిరస్కరిస్తే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయొచ్చు. దాన్నీ తిరస్కరిస్తే చివరగా క్షమాభిక్ష పెట్టండంటూ రాష్ట్రపతిని అభ్యర్థించవచ్చు.
సుప్రీం కోర్టు తీర్పును మార్చే అధికారం ఆయనకు మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఇంతకాలంలో నిర్ణయం తీసుకోవాలనే రూలు లేదు కాబట్టి ఆ పిటిషన్ ఎంతకాలం పెండింగులో ఉంటుందో చెప్పలేం. కొందరు రాష్ట్రపతులు తమ పదవీ కాలం ముగిసేలోగా కూడా ఏ ఒక్క మెర్సీ పిటిషన్‌పై నిర్ణయాలు తీసుకోరు. కేఆర్ నారాయణన్, ప్రతిభా పాటిల్, అబ్దుల్ కలాం నిర్ణయం తీసుకోకుండా వదిలేసిన పిటిషన్లలో కొన్నింటిని ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్లియర్ చేశారట. 2004 నుంచి 2013 వరకు 1,303 కేసుల్లో మరణశిక్ష విధించగా ఇప్పటివరకు అమలు జరిగినవి మూడు (కసబ్, అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్) మాత్రమే. జ్యోతిసింగ్ మరణానికి కారకులైనవారి మరణ వార్తను ఆమె తల్లిదండ్రులు ఎప్పుడు వింటారో….!