ఫలానా వ్యక్తి మోసం చేసాడు అని ఎవరైనా అమ్మాయి ఛానెల్ మెట్లు ఎక్కి ఫొటోలు చూపిస్తే ఆనందంగా టీవీలో అదే పనిగా చూపిస్తారు. ఇలా కామన్ జనాల కేసులు ఏవైనా టీవీలో ఫొటోలు, వీడియోలు ఇట్టే ఎక్కేస్తుంటాయి. అదే ఓ బడా కాలేజీ లేదా బడా సంస్థ అంటే, పేరు చెప్పకుండా ఇండికేషన్ ఇచ్చి ఊరుకుంటారు.
వర్తమానానికి వస్తే, శ్రీరెడ్డి అనే అమ్మాయి ఓ బడా ప్రొడ్యూసర్ కొడుకు తనను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడని ఆరోపించింది. ఆ మేరకు కొన్ని ఫొటోలు ఛానెల్ కు ఇచ్చింది.
ఆ ఫొటోల్లో శ్రీరెడ్డి మరో వ్యక్తి సన్నిహితంగా వున్నారు. ఇదే వ్యవహారం ఆంధ్ర, తెలంగాణల్లో మరే కామన్ మనుషులదైనా ఆ ఫోటోలు అలాగే చూపించేవారు. కానీ ఇక్కడ ఆ ఫొటోల్లో వున్నది ఓ బడాబాబు కొడుకు. అందుకే ఛానెల్ కొత్త పల్లవి అందుకుంది.
ఫొటోల్లో ఆ వ్యక్తి కళ్లపై నల్ల పట్టే వేసేసి చూపించింది. ఎందుకు అలా చూపించడం అంటేనట.. ఈ ఫొటోలపై సదరు వ్యక్తి తాలూకు వాళ్లు ఎవరూ స్పందించ లేదట. అందుకే అలా చూపించారట. స్పందించాక, పూర్తిగా చూపిస్తారట.
మరి గడచిన దశాబ్ద కాలంగా టీవీల్లో కావచ్చు లేదా ఇదే చానెల్ లో కావచ్చు అనేకానక ఫొటోలు కేసులు ఎలా చూపించారు. ఎలా నానా యాగీ చేసారు. అంటే వాళ్లు కామన్ మనుషులు కాబట్టి అలా. ఇక్కడ బడాబాబు కాబట్టి ఇలా. ఏం మీడియా? ఏం న్యాయం?