జవాన్ అంటేనే దేశానికి సెక్యూరిటీ. అలాంటి పేరుతో వస్తున్న జవాన్ సినిమాకు అండగా నిల్చున్నాడు నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఏమిటి కథ? జవాన్ నిర్మాత కృష్ణ అంటే ప్రేమా? లేక హీరో సాయిధరమ్ అంటే అభిమానమా? ఏదో ఒకటి. కానీ మొత్తం మీద జవాన్ ప్రాజెక్టు మొత్తం దిల్ రాజు పర్యవేక్షణలో సాగడం సంగతి అలా వుంచితే, ఇప్పుడు రిలీజ్ వ్యవహారాలు కూడా ఆయనే చూస్తున్నారు. సినిమా అమ్మకాలు, థియేటర్లు, పబ్లిసిటీ ఇలా అన్నీ దిల్ రాజే.
అసలు జవాన్ ప్రాజెక్టు దిల్ రాజే నిర్మించాల్సింది. హరీష్ శంకర్ డైరక్షన్ లో. కానీ హీరోలకు మేనేజర్ గా, నిర్మాతలకు ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పని చేసే కృష్ణ నిర్మాతగా మారుతానంటే, ప్రాజెక్టు ఆయన చేతిలో పెట్టారు. కానీ అది డైరక్టర్ హరీష్ శంకర్ కు నచ్చలేదని వినికిడి. దాంతో డైరక్టర్ మారారు కానీ నిర్మాత మారలేదు. కృష్ణే నిర్మాత. దిల్ రాజు సమర్పకుడు.
అక్కడి నుంచి అన్నీ తానే సూపర్ వైజ్ చేసిన దిల్ రాజు ఇప్పుడు విడుదల కూడా తన చేతిలోకే తీసుకున్నారు. సినిమా ఎంతకు అమ్మారు.. అమ్మారా లేదా? థియేటర్లు ఏమిటి? ఎక్కడ? అన్నీ దిల్ రాజు లేదా శిరీష్ సూపర్ విజన్ లోనే.
అన్నీ బాగానే వున్నాయి. అంతా బాగానే వున్నాయి. ఇదంతా చూసి, దిల్ రాజే జవాన్ కు అసలు నిర్మాత. కృష్ణను ముందు పెట్టి, ఆయనే సినిమా నిర్మించారు. ఇదో విధంగా దిల్ రాజు సెకెండ్ బ్యానర్ అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తోంది. మరి దాని సంగతేమిటో? ఈ గుసగుస సంగతి ఎలా వున్నా, నిర్మాత కృష్ణ మాత్రం వ్యవహారాలన్నీ దిల్ రాజు చేతిలో వుంచేసి దిల్ ఖుష్ గా వున్నారు.