రజనీ కాంత్ సినిమాలు అంటే ఒకప్పుడు తెలుగులో హాట్ కేక్ లు. ఆ మోజుతోనే దాదాపు నాలుగైదు సినిమాల నుంచి బయ్యర్లు చావుదెబ్బలు తిన్నారు.
అయినా ఇంకా రజనీ సినిమాలు అంటే తెలుగునాట కుమ్మేస్తాయని నమ్మకం పోలేదు. అయితే ఆ నమ్మకం మన బయ్యర్ల కన్నా, తమిళ నిర్మాతలకు ఎక్కువ వుంది. అందుకే కాలా సినిమా తెలుగు హక్కులు 40కోట్లు చెబుతున్నారు.
రోబో 2 సినిమా 80కోట్లకు అమ్ముడుపోయింది. అది వేరే సంగతి. అలా అని కాలా సినిమాను 40కోట్లకు కొనే ధైర్యం ఎవరు చేస్తారు? అందుకే ఎవ్వరూ ముందుకు రావడం లేదు. 20కోట్లకు కొన్నా భాగ్యమే అని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
అయినా తమిళ నిర్మాతలు మాత్రం 40కోట్లకు తగ్గేది లేదంటున్నారట. ఒకరిద్దరు కాస్త ఆసక్తి చూపినా, రజనీ సినిమా అందులోనూ కాలా సినిమా 40కోట్లు కష్టమేమో అని అనుమానం వ్యక్తం చేసి వెనక్కు తగ్గారని తెలుస్తోంది. మరి ఎవరు దొరుకుతారో ఈసారి? ఎవరు బలవుతారో మరోసారి? చూడాలి.