బాహుబలి సిరీస్ టాలీవుడ్ కు రెండు మూడు కొత్త విషయాలు నేర్పింది. ఒకటి పాన్ ఇండియా సినిమా. రెండవది రెండు భాగాలుగా తీయడం. మూడవది పీరియాడిక్ సినిమాలు అటెంప్ట్ చేయడం.
బాహుబలి తరువాత రెండు భాగాల సినిమాగా ఇప్పటికే బన్నీ-సుకుమార్ ల పుష్ప లిస్ట్ లో చేరింది. ఇప్పుడు ఈ జాబితాలో మరో సినిమా కూడా చేరబోతోందని తెలుస్తోంది.
కొత్త దర్శకుడు వాశిష్ట (మల్లిడి వేణు) అందిస్తున్న బింబిసార సినిమాను హీరో కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు. అశోకుడి తాత కాలం నాటి కథతో తయారవుతున్న సినిమా ఇది.
కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. భారీ క్లయిమాక్స్ మాత్రం మిగిలి వుంది.
అయితే సినిమా అంతా తయారవుతుంటే చాలా పెద్ద సినిమాగా అనిపిస్తోందని, రెండు భాగాలు చేస్తే బెటర్ అనే ఆలోచనలు మొదలైనట్లు బోగట్టా. దాంతో ఇప్పుడు ఆ దిశగా డిస్కషన్లు సాగుతున్నాయి. రెండు భాగాలు చేయాలనే నిర్ణయం దాదాపు తీసుకున్నట్లే అని తెలుస్తోంది.