హాల్ లో శోభనం.. బెడ్రూమ్ లో పడక..!

జగనన్న కాలనీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల స్థలాల విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. కొత్తగా పెళ్లయిన జంట ఇంటికి వస్తే.. కనీసం శోభనం…

జగనన్న కాలనీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల స్థలాల విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. కొత్తగా పెళ్లయిన జంట ఇంటికి వస్తే.. కనీసం శోభనం చేసుకోడానికి డబుల్ బెడ్ కూడా పడక గదిలో పట్టదని నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. 

హాల్ లో శోభనం చేసుకున్నాక, బెడ్రూమ్ లో పడుకోవాల్సి ఉంటుందని అన్నారు. దంపతుల కష్టాల్ని అర్థం చేసుకుని ఇంటి స్థలాన్ని పెంచాలని లేదా, బాత్రూమ్ ని ఇంటి బయట కట్టేలా చూడాలని గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథ రాజుకి సూచించారు ఎమ్మెల్యే.

హౌసింగ్ పై నెల్లూరు జిల్లాలో జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేనే సెటైర్లు వేస్తుండే సరికి జిల్లా మంత్రులు, మిగిలిన ఎమ్మెల్యేలు సైతం విస్తుపోయారు. చివరకు ఆయన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటామని కలెక్టర్ ముక్తాయించారు.

పల్లెటూళ్లలో ఒకటిన్నర సెంట్లు, పట్టణాల్లో ఒక సెంటు భూముని పేదలకు అందిస్తోంది ప్రభుత్వం. అపార్ట్ మెంట్ల పేరుతో నాసిరకం ఇళ్లు కట్టించి ఇవ్వడం, వాటిలో ఉండలేక, పేదలు వేరే గూడు చూసుకోవడం.. చాన్నాళ్లుగా జరుగుతున్నదే. ఒకవేళ ప్రభుత్వం ఇంటి స్థలాన్నిచ్చినా ఊరి చివర కేటాయింపులుండేవి. ఇవన్నీ పక్కనపెట్టి, ప్రభుత్వ డబ్బుతో ప్రైవేటు స్థలాలను కొని, పేదలకు పంచారు సీఎం జగన్.
 
చిన్నదైనా, పెద్దదైనా స్థలం ఉంది అన్న భరోసా కోసం పల్లెటూళ్లలో ఒకటిన్నర సెంటు, పట్టణాల్లో సెంటు భూమిని ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే కేటాయింపులు జరిగాయి, ఇళ్ల నిర్మాణం మొదలవుతోంది.

సెంటు భూమిలో ఇల్లు ఎలా కట్టుకుంటారని అడుగుతున్న ప్రశ్న సమంజసమే అయినా, పొందికగా కడితే ఆ ఇళ్లు ఎంత బాగుంటాయో మోడల్ హౌస్ లతో నిరూపించారు కూడా. అదే సమయంలో ఉమ్మడి కుటుంబాలకు అక్కడ స్థానం లేదనే విషయం అందరికీ తెలిసిందే. 

నేటి ఆధునిక కాలంలో అందరివీ మైక్రో, మినీ కుటుంబాలే. భార్య, భర్త, పిల్లలు.. వీరి వరకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో నిర్మించే ఇల్లు పొందికగా సరిపోతుంది. ఒకవేళ కుటుంబం పెద్దదై, పిల్లలకు పెళ్లిళ్లు జరిగితే, వారికి ప్రత్యేకంగా ఇంటి స్థలం కేటాయిస్తుంది ప్రభుత్వం. ఇదీ ఈ పథకంలోని పరమార్థం.

ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నేతలు.. ఈ విషయాలను జనంలోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలి కానీ, తామే ఇలా విమర్శలు చేస్తే ఏం బాగుంటుంది. హాల్ లో శోభనం, బెడ్రూమ్ లో పడక అంటూ వైసీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.