థర్డ్ వేవ్ ప్రమాదం కాదు.. డెల్టా ప్లస్ కారణం కాదు

దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ లో జరిగిన నష్టం చూశాం. ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు, అదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ తోనే థర్డ్…

దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ లో జరిగిన నష్టం చూశాం. ఇప్పుడు థర్డ్ వేవ్ అంటున్నారు, అదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ తోనే థర్డ్ వేవ్ మొదలవుతుందనే ప్రచారం కూడా ఉంది. దీనిపై ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. 

ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ తో కలసి చేసిన అధ్యయన ఫలితాల్ని వెల్లడించారు. డెల్టా ప్లస్ వేరియంట్లపై చేసిన పరిశోధనల ఫలితాలను ఐసీఎంఆర్ ఎపిడమాలజీ విభాగాధిపతి సమీరన్ పాండా వివరించారు.

వేరియంట్ కి వేవ్ కి సంబంధం లేదు..

కరోనా వచ్చిన తర్వాత కొవిడ్-19 వైరస్ లో చాలా వేరియంట్లు వచ్చాయి. ఆల్ఫా, బీటా, గామా.. ఇలా వేరియంట్లకు పేర్లు పెట్టుకుంటూ వెళ్తున్నామే కానీ, ప్రతి వేరియంట్ కి కొత్త వేవ్ వస్తుందనే ప్రచారం తప్పని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. డెల్టా వేరియంట్ ఒక్కటే కాస్త ఎక్కువ నష్టం కలిగించిందని తేల్చి చెప్పారు.

డెల్టా ప్లస్ వేరియంట్ ప్రభావం ఎంత ఉంటుందనే విషయంపై అంచనాకు రాగలిగితే, అది థర్డ్ వేవ్ కి కారణం అవుతుందా లేదా అనేది చెప్పొచ్చు. ప్రస్తుతానికి డెల్టా ప్లస్ వేరియంట్ తో పెనుముప్పు లేదని తెలుస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ తో థర్డ్ వేవ్ మొదలైందనే ప్రచారాన్ని ఐసీఎంఆర్ ఖండించింది.

ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా సెకండ్ వేవ్ కంటే దాని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం లేదని చెప్పారు సమీరన్ పాండా. ప్రస్తుతం భారత్ లోని 10 రాష్ట్రాల్లో 49 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు గమనించినట్టు తెలిపారు. డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల పెరుగుదలకు, థర్డ్ వేవ్ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

మూడో వేవ్ అలా మొదలవుతుంది..

థర్డ్ వేవ్ వచ్చేనాటికి దేశంలో వ్యాక్సినేషన్ మరింత జోరందుకుంటుందని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే దాని ప్రభావం పెద్దగా ఉండదని చెబుతున్నారు ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు. 

డెల్టా ప్లస్ వేరియంట్ పై ప్రస్తుతం మన దేశంలో వినియోగిస్తున్న టీకాలు సమర్థంగా పనిచేస్తాయా లేదా అనే విషయంపై అధ్యయనం జరుగుతోందని చెప్పారు. గతంలో సోకిన వేరియంట్ వల్ల వచ్చిన రోగనిరోధక శక్తి, కొత్త వేరియంట్ ని ఎదుర్కోలేకపోతే అప్పుడే కొత్త వేవ్ మొదలవుతుందని చెప్పారు.